Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా ప్రాతినిథ్యంపై మాయ మాటలు
- కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య 11శాతం లోపే..
- 2011లో జరిగిన సర్వేనే ఆధారం..తాజాగా సర్వే చేపట్టని కేంద్రం
- 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అటకెక్కించిన మోడీ సర్కార్
- వారి ప్రాతినిథ్యం లోక్‌సభలో 15శాతం..రాజ్యసభలో 13.6శాతం
వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, వాటి విభాగాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య 10.9శాతం మాత్రమే ఉందని తాజాగా గణాంకాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 82 (15శాతం), మార్చి 16నాటికి రాజ్యసభలో మహిళా ఎంపీల సంఖ్య 33 (13.6శాతం). లోక్‌సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పార్లమెంట్లో ఈ వివరాలు విడుదల చేశారు. అలాగే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్నీ తన సమాధానంలో ప్రస్తావించారు. ఆమె చెప్పినదాన్నిబట్టి ఈ బిల్లు ఇప్పట్లో అమోదం పొందే పరిస్థితి లేదని అర్థమవుతోంది.
న్యూఢిల్లీ : మహిళా సాధికారతపై పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే మన పాలకులు..తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే ఎత్తరు. బేటి బచావో, బేటి పడావో, చట్టసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు..మొదలైనవాటిపై అధికార బీజేపీ ఎన్నో వాగ్దానాలు చేసింది. మోడీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడి దాదాపు 9ఏండ్లు అవుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయటం మోడీ సర్కార్‌కు క్షణాల్లో పని. అయినప్పటికీ ఎన్నడూ ఈ బిల్లు గురించి అధికార బీజేపీ మాటమాత్రంగా కూడా మాట్లాడటం లేదు. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారింది. చట్టసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్లు అమలుజేయాలని వివిధ రాజకీయ పార్టీలు ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. దేవగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 1998, 1999, 2008, 2014లోనూ బిల్లును పార్లమెం ట్లో ప్రవేశపెట్టారు. 2014లో మోడీ సర్కార్ వచ్చాక, ఈ బిల్లును పూర్తిగా మూలనపడేసింది.
30లక్షల్లో 3లక్షలు
కేంద్ర మంత్రిత్వశాఖలు, వాటి పరిధిలోని వివిధ విభాగాల్లో మహిళా ఉద్యోగుల వివరాలు సదరు ఎంపీ కోరగా, స్మృతీ ఇరానీ ఎప్పుడో 2011నాటి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ చేపట్టిన సర్వేను ప్రస్తావించారు. డైరెక్టరేట్ జనరల్ (ఉపాధి, శిక్షణ) విడుదల చేసిన వివరాల్ని వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం వివిధ కేంద్రమంత్రిత్వ శాఖలు, వాటి విభాగాల్లో మొత్తం 30,87,278మంది ఉద్యోగులున్నారు. ఇందులో 3,37,439మంది మహిళలు పనిచేస్తున్నారు. దీనిని బట్టి మహిళల ప్రాతినిథ్యం 10.9శాతంగా ఉండొచ్చని స్మృతీ ఇరానీ అన్నారు. ఈ 9ఏండ్లలో మోడీ సర్కార్ మరో సర్వే నిర్వహించలేదని ఇక్కడ అర్థమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 724 మంది మహిళలు ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇందులో 82మంది గెలుపొంది సభలో అడుగుపెట్టారు. 2014 లోక్‌సభతో పోల్చుకుంటే మహిళా సభ్యుల సంఖ్య 68 నుంచి 82కు పెరిగింది. మోడీ హయాంలోని ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో 11మంది మహిళలకు చోటుదక్కింది. ఇందులో అత్యధికం సహాయమంత్రి హోదాలే ఉన్నాయి.
పోలీస్ బలగాల్లో 10.5శాతం
రాష్ట్ర పోలీస్‌లో ఎంతమంది మహిళలు పనిచేస్తున్నారన్నది కేంద్రం తెలుపలేదు. గత ఏడాది విడుదలైన 'ఇండియా జస్టిస్' నివేదిక ప్రకారం, ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను 20 రాష్ట్రాలకుపైగా వివిధ నిష్పత్తుల్లో అమలుజేస్తున్నాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పోలీస్ బలగాల్లో మహిళల ప్రాతినిథ్యం 10.5శాతం వద్దే ఆగిపోయింది. ఈ అంశానికి సంబంధించి గత ఏడాది బడ్జెట్ సమావేశాల్లో 'బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్' గణాంకాల్ని కేంద్రం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం దేశంలో పనిచేస్తున్న పోలీస్ బలగాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య 10.3శాతముందని పేర్కొంది. అత్యధికశాతం ప్రాతినిథ్యమున్న రాష్ట్రాలుగా ..బీహార్-25.3శాతం, హిమాచల్-19శాతం, చండీగఢ్-18శాతం. .ముందు వరుసలో నిలబడ్డాయి.
పంచాయతీరాజ్‌లో 50శాతం రిజర్వేషన్
పంచాయతీరాజ్ సంస్థలు..భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 234డి కిందకు వస్తాయి. ఈ ఆర్టికల్ ప్రకారం పంచాయతీరాజ్ కిందకు వచ్చే అన్ని రకాల విభాగాల్లో కనీసం మూడోవంతు స్థానాలు మహిళలకు కేటాయించాలి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 21 రాష్ట్రాలు మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలుజేస్తూ, తమ తమ రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ చట్టాల్ని చేశాయి. అయితే పంచాయతీరాజ్ సంస్థల్లో ఎంతమంది మహిళలున్నారు? వారి ప్రాతినిథ్యం ఏమేరకు పెరిగిందన్న వివరాల్ని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించలేదు.