Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవ్యవవస్థ నిష్పాక్షికతపై సందేహాలు
- పెత్తందార్లకు ఒకతీరు.. అణగారిన వర్గాలకు ఇంకోతీరు
- 'హత్రాస్' కేసును ఉటంకిస్తూ నిపుణుల ప్రశ్నలు
న్యూఢిల్లీ : మోడీ పాలనలో మహిళలకు, దళితులకు రక్షణ కరువైంది. రాజ్యంగబద్ధంగా స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థలు, వ్యవస్థలూ 'ప్రభావితమవుత్నున్నాయి'. నిష్పక్షపాతంగా పని చేయాల్సిన వ్యవస్థలపై ప్రభుత్వాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒత్తిళ్లు తీసుకొచ్చి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని విశ్లేషకులు, నిపుణులు ఆరోపించారు. ముఖ్యంగా, లైంగికదాడి కేసుల్లో కులాన్ని బట్టి న్యాయం, శిక్ష అమలు జరుగుతున్నాయన్నారు. ఇవి బాధితులు, నిందితులు పెత్తందారీ కులాలు అయితే ఒకలా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారైతే మరోలా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'హత్రాస్', 'నిర్భయ' ఘటనలను నిపుణులు ఈ సందర్భంగా ఉటంకించారు.
దాదాపు మూడేండ్ల క్రితం యూపీలోని 19 ఏండ్ల దళిత యువతిపై పెత్తందారీ కులానికి చెందిన నలుగురు సామూహిక లైంగికదాడికి తెగబడి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లో యూపీ సర్కారు వ్యవహరించిన తీరు పైనా తీవ్ర దుమారం చెలరేగింది. అయితే, ఈ కేసులో హత్రాస్‌లోని ఎస్సీ, ఎస్టీ కోర్టు నలుగురు నిందితుల్లో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించి ఒకరికి మాత్రమే శిక్ష విధించింది. ఇప్పుడీ తీర్పే న్యాయవ్యవస్థ నిష్పాక్షికత గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నదని నిపుణులు తెలిపారు.
నిందితులు పెత్తందారీ కులాలవారు కాకుండా దళిత, మైనారిటీ వర్గానికి చెందినవారై ఉంటే పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉండేదేమోనని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో 2012లో చోటు చేసుకున్న 'నిర్భయ' ఘటన యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసిన విషయం విదితమే. ఈ కేసులో న్యాయస్థానం ఒకరికి మినహా మిగిలిన నిందితులకు మరణశిక్ష విధించిన విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు తీర్పు స్వాగతించదగినదేననీ, అయితే హత్రాస్ కేసులో నిందితులందరీకి శిక్ష ఎందుకు పడలేకపోయిందని వారు ప్రశ్నించారు. బాధితురాలు దళితురాలు కావడమా? లేక నిందితులు పెత్తందారీకులాలకు చెందినవారు కావడమా? లేక ఈ రెండూ కారణమా? అని సందేహాన్ని వారు వ్యక్తం చేశారు. న్యాయస్థానం అనుసరించే 'సామూహిక(సమిష్టి) మనస్సాక్షిని సంతృప్తిపర్చడం' అనే న్యాయపరమైన హేతుబద్ధత ఇక్కడ ఎందుకు లోపించిందని వారు ప్రశ్నించారు.
ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ 2016 అధ్యయనం ప్రకారం.. మరణశిక్షలు విధించిన ఢిల్లీ కోర్టుల తీర్పులలో 72 శాతం, మధ్యప్రదేశ్ కోర్టులలో 42 శాతం, మహారాష్ట్ర కోర్టులలో 51శాతం ''సామూహిక మనస్సాక్షిని సంతృప్తిపరచడం'' ప్రధాన అంశంగా, న్యాయపరమైన హేతుబద్ధతగా పేర్కొన్నాయి. 2016 నాటికి మరణశిక్ష పడిన వారిలో 75 శాతానికి పైగా దళితులు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మైనారిటీ వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం.
2012 నాటి నిర్భయ సామూహిక లైంగికదాడి కేసులో సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యమైన నిబంధనలలో తన తీర్పులను హేతుబద్ధం చేసింది. ''హేయమైన నేరాలలో శిక్షను నిర్ణయించేటప్పుడు, న్యాయమూర్తులు సమాజంపై దాని ప్రభావాన్ని అంచనా వేయాలి. సామూహిక మనస్సాక్షి లేదా న్యాయం కోసం సమాజం యొక్క మొరను పరిగణనలోకి తీసుకుని తగిన శిక్షను విధించాలి. తగిన శిక్ష విధించడాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, న్యాయస్థానాలు నేరస్థుడి హక్కులను మాత్రమే కాకుండా బాధితుడి మరియు సమాజం యొక్క హక్కులను కూడా దష్టిలో ఉంచుకోవాలి'' అని న్యాయస్థానం తెలిపింది.
అయితే, హత్రాస్ కేసులో ఇదెక్కడా కనబడలేదన్నారు. అలాగే, ఈ అంశాలను వర్తింపజేయడంలో పలు సందర్భాల్లో వివక్ష కనబడుతున్నదని నిపుణులు అన్నారు. ముఖ్యంగా బాధితులు దళిత మరియు ముస్లిం వర్గాలకు చెందినవారుగా ఉన్న కేసుల్లో ఇది స్పష్టమవుతున్నదన్నారు. ఇందుకు హత్రాస్ ఘటనే ఒక ఉదాహరణ అని అన్నారు. హత్రాస్ కేసులో ఉన్నత న్యాయస్థానంలోనైనా నిందితులకు శిక్షపడేలా చేయాలన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఎంతో అవసరమనీ, కానీ బాధితురాలి మరణించినపుడు యోగి సర్కారు వ్యవహరించిన తీరును బట్టి చూస్తే ఆ సహకారం లభిస్తుందనుకోవడం అత్యాశే అవుతుందిని నిపుణులు ఆవేదనను వ్యక్తం చేశారు.