Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగుదేశం అభ్యర్థి అనూరాధ అనూహ్య గెలుపు
- ఆరు స్థానాలతోనే సరిపెట్టుకున్న అధికార పార్టీ
- క్రాస్ ఓటింగ్ ఫలితం
- చంద్రబాబు నివాసంలో సంబరాలు
అమరావతి : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపికి టిడిపి గట్టి షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యమైన రీతిలో విజయం సాధించారు. ఈ పరిణామం వైసిపి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా వైసిపి అన్ని స్థానాలకు తన అభ్యర్థులను నిలబెట్టింది. ఏడింటిని చేజిక్కించుకోవాలని తహతహలాడింది. తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో 19 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నప్పటికీ, ఆ పార్టీ అభ్యర్థి అనూరాధకు 23 మంది శాసన సభ్యుల మద్దతు లభించడంతో ఆమె ఎవరూ ఊహించని రీతిలో విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారని వైసిపి ఊహించింది. అయితే వీరిద్దరే కాదు మరి కొందరు వైసిపి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో అన్ని స్థానాలు గెలవాలని ఆశించిన అధికార పార్టీ ఆరు సీట్లతో సరిపెట్టుకుంది. ప్రతి ఒక్కరికీ 22 ఓట్లు కావాల్సి ఉండగా టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. మిగిలిన ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోతుల సునీత, ఇజ్రాయేలు, మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, సూర్యనారాయణరాజుకు 22 ఓట్లు చొప్పున వచ్చాయి. కోలా గురువులు, జయమంగళ వెంకటరమణకు 21 ఓట్లు చొప్పున వచ్చాయి. దీంతో వారికి రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ చేపట్టారు. ఈ క్రమంలో జయమంగళ వెంకటరమణకు కావాల్సిన ఓటు రావడంతో అతను గెలుపొందినట్లు ప్రకటించారు. గెలిచిన ఏడుగురికి రిటర్నింగ్ అధికారి ఎం.టి.కృష్ణబాబు ధృవీకరణపత్రాలు అందించారు. ఉదయం పోలింగు దగ్గర నుండి సాయంత్రం వరకూ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడి పెళ్లి ఉండటంతో చివరిగా వచ్చి ఓటు వేశారు. ఆయన కోసం ప్రత్యేక హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 175 ఓట్లు పోలయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పోలింగు పూర్తయిన తరువాత ఎన్నికల కమిషన్ నుండి కౌంటింగ్ అనుమతి కోసం ఎదురు చూశారు. ఐదు గంటల సమయానికి అనుమతి రావడంతో కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. తొలుత ఎనిమిది ట్రేలను ఏర్పాటు చేసి ఎన్నికల అధికారులు కౌంటింగ్ మొదలు పెట్టారు. తొలి ప్రయత్నంలోనే అనూరాధకు 23 ఓట్లు వచ్చాయి. దీంతో వైసిపి కంగుతిన్నది. తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అనంతరం చెవిరెడ్డి కౌంటింగ్ హాలు నుండి బయటకు వెళ్లిపోయారు. జయమంగళగ వెంకటరమణ, కోలా గురువులను రిటర్నింగ్ అధికారి కృష్ణబాబు పిలిచి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్క పెడుతున్నట్లు ప్రకటించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరు గెలుస్తారోననే తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో జయమంగళ వెంటకరమణ గెలుపొందినట్లు ప్రకటించారు.
రీ కౌంటింగ్‌లోనూ అదే ఫలితం
టిడిపి అభ్యర్థి అనూరాధకు వచ్చిన ఓట్లను లెక్కించాలని వైసిపి ఏజెంట్లు పట్టుబట్టడంతో రీకౌంటింగ్ నిర్వహించారు. అందులోనూ 23 ఓట్లు రావడంతో పోటీలో ఉన్న అందరి కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిగా అనూరాధ నిలిచారు. ఉదయం ఓట్లు వేసి వెళ్లే సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆత్మప్రభోదానుసారం ఓటు వేశానని ప్రకటించారు.
23...23...23
23వ తేదీన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి 23 ఓట్లతో గెలుపొందిందని, టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కౌంటింగ్ అనంతరం అక్కడ పెద్దఎత్తున చర్చ జరిగింది. ఇదే అంశంపై లోకేష్ కూడా ట్వీట్ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కున్నా టిడిపి నాలుగు ఓట్లు టిడిపి వచ్చాయని పేర్కొన్నారు
ఇటువంటి వాటిలో చంద్రబాబు నేర్పరి
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నేర్పరితనాన్ని చూపించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీ పెట్టిన దగ్గర నుండి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నామని, అయినా ఇలా ఎందుకు జరిగిందో విశ్లేషిస్తామని తెలిపారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నేర్పరి అని అన్నారు. కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వారికి ఓట్లు వేస్తారని తెలుసని, అయినా మరికొన్ని ఓట్లు పడ్డాయని, అవి ఎలా జరిగిందో పరిశీలిస్తామని చెప్పారు.
చంద్రబాబు ఇంట సంబరాలు
అనూరాధ గెలిచిన వెంటనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. రాజధాని ప్రాంత వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పెద్దఎత్తున టపాసులు కాల్చారు. మందడంలో మహిళలు శిబిరం వద్దకు చేరుకున్నారు. ఎన్టిఆర్ విగ్రహం వద్ద భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. వైసిపిలో 16 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, కొంతమంది ఆత్మప్రబోధానసారం ఓట్లు వేశారని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. శాసనమండలి ఎన్నికల్లోనూ మూడు స్థానాల్లో గెఉపొందామని, ఇప్పుడు ఎమ్మెల్యేల కోటా ఎన్నికల్లోనూ విజయం సాధించామని వైసిపిపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని అన్నారు. వైసిపి విజయపరంపర మొదలైందని, ఇక వైసిపి ప్రభుత్వ ఓటమి కోసం పోరాడాల్సిందేనని బాలకృష్ణ పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో జరిగిన ఎన్నికల్లో టిడిపి గెలుపు పార్టీకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్నొన్నారు. తెలుగింటి ఆడపడుచు అనూరాధకు శుభాకాంక్షలు అంటూ నందమూరి రామకృష్ణ తెలిపారు.
ఆ నలుగురు
వైసిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి ఓటు వేశారు. వాస్తవంగా టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ టిడిపిని వ్యతిరేకించి, వైసిపి అనుబంధ సభ్యులుగా మారారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసిపిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని ప్రకటించారు. అయితే ఇద్దరు సభ్యులు టిడిపికి ఓటు వేసినా తమ గెలుపుఖాయమనే ధీమాతో వైసిపి నాయకులు ఉన్నారు. వారితోపాటు మరో ఇద్దరు సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడంతో టిడిపి అభ్యర్థి గెలుపు ఖాయమైంది.