Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తికాని పోలవరం మొదటిదశ సహాయ, పునరావాసం :జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం 41.15 మీటర్ల ఎత్తు వరకని జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ సహాయం, పునరావాసం ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పూర్తి కాలేదని మంత్రి పేర్కొన్నారు. గురువారం లోక్సభలో వైసిపి ఎంపి భీశెట్టి సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం కింద మొత్తం 1.06 లక్షల నిర్వాసిత కుటుంబాలు ఉండగా, తొలి దశ కింద 20,046 కుటుంబాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. 2023 మార్చి నాటికి మొదటి దశ 20,046 కుటుంబాలకు పునరావాసం, పరిహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఫిబ్రవరి నాటికి కేవలం 11,677 కుటుంబాలకే (55 74 శాతం) సహాయం, పునరావాసం కల్పించినట్లు ఆయన తెలిపారు. సహాయం, పునరావాసం జాప్యంపై సమయాను గుణంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల్లో 18 ఏండ్లు నిండిన వారిని ప్రత్యేక కుటుంబాలుగా గుర్తించాలని పలువురు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 2005 ఏప్రిల్ 8న ప్రాజెక్టు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ నాటికి 18 ఏండ్లు నిండిన వారే అందుకు అర్హులని ఆయన తెలిపారు. ప్రాథమిక నోటిఫికేషన్ తరువాత 18 ఏండ్లు నిండిన వారు ప్రత్యేక కుటుంబాల కింద అర్హులు కారని మంత్రి స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల్లో అత్యధికులు వారే ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రివైజ్డ్ కాస్ట్ కమిటీ పోలవరం ప్రాజెక్టు కోసం 1,27,263 ఎకరాల భూమిని సేకరించాల్సిన అవసరం ఉందని నిర్ధారించిందని, అయితే 2023 ఫిబ్రవరి నాటికి 1,13,119 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగతా సేకరణ వివిధ దశల్లో ఉందని, ప్రస్తుత పూర్తి షెడ్యూల్ ప్రకారం, మిగతా భూమిని 2023 డిసెంబర్ నాటికి స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.
గోదావరి నుంచి యేటా సముద్రంలోకి
2011-21 మధ్య సగటున ఏడాదికి గోదావరి నుంచి 86,219 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలు, కృష్ణా నుంచి 12,333 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలు సముద్రంలో కలిసినట్లు జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్సభలో గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
గుంటూరు డివిజన్లో 600, సికింద్రాబాద్ డివిజన్లో 2,978 పోస్టులు ఖాళీ
దక్షిణ మధ్య రైల్వేలో నాన్ గెజిటెడ్ అధికారుల విభాగంలో గుంటూరు డివిజన్లో గ్రూప్-సిలో 301, లెవల్-1లో 386 మొత్తం 600 పోస్టులు, సికింద్రాబాద్ డివిజన్లో గ్రూప్-సిలో 1,796, లెవల్-1లో 1,112 మొత్తం 2,978 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వైసిపి, బిఆర్ఎస్ ఎంపిలు లావు శ్రీకృష్ణదేవరాయలు, పసునూరి దయాకర్, జి.రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, బొర్లకుంట వెంకటేష్ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.