Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరువునష్టం కేసులో సూరత్‌కోర్టు తీర్పు..
- 2019లో 'మోడీ' ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల ఫలితం
- పైకోర్టులో అప్పీలుకు బెయిల్ మంజూరు
- 30 రోజుల పాటు శిక్ష నిలుపుదల
న్యూఢిల్లీ : పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని గుజరాత్‌లోని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు రెండేండ్ల జైలు శిక్షను విధించింది. అనంతరం పైకోర్టులో అప్పీలుకు వెళ్లడానికి బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. 2019లో 'మోడీ' ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఈ శిక్ష ఖరారైంది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 499, 500 కింద రాహుల్ గాంధీ దోషిగా తేలారని న్యాయవాది కేతన్ రేషమ్‌వాలా తెలిపారు. '' రెండేండ్ల శిక్షను విధించారు. అప్పీలు కోసం 30 రోజుల పాటు కోర్టు ఆయనకు (రాహుల్ గాంధీ) బెయిల్‌ను ప్రసాదించింది. శిక్ష సస్పెండ్ అయింది'' అని రేషమ్‌వాలా తెలిపారు.
రాహుల్ ట్వీట్
సూరత్ కోర్టు తీర్పు అనంతరం రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. '' నా మతం సత్యం, అహింసపై ఆధారపడి ఉంటుంది. సత్యం నా దైవం. అహింసా దానిని సాధించే ఆయుధం'' అని మహత్మా గాంధీ వ్యాఖ్యలను ఆయన జోడించారు.
ఏమిటీ ఈ కేసు?
2019 సాధారణ ఎన్నికల సందర్భంగా రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ సూరత్ పశ్చిమ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ''దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది'' అని రాహుల్ వ్యాఖ్యానించారని సూరత్ కోర్టును ఆశ్రయించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుదారు తన పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తం మోడీ వర్గాన్ని ఇది అవమానపర్చేలా ఉన్నదని పూర్ణేశ్ మోడీ చెప్పారు.
గత శుక్రవారమే తుది వాదనలు
ఈ పిటిషన్‌పై కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేటు హె.హెచ్. వర్మ గత శుక్రవారమే తుది వాదనలు విన్నారు. తుది తీర్పును గురువారం(23వ తేదీకి) వాయిదా వేశారు. తుది తీర్పు సమయంలో కోర్టులో ఉండాల్సిందిగా ఆ సమయంలో కోర్టు రాహుల్‌ను ఆదేశించింది. ఈ కేసులో ఇదివరకే ఆయన మూడు సార్లు కోర్టుకు హాజరయ్యారు. వాంగ్మూలం నమోదు కోసం చివరగా ఆయన 2021 అక్టోబర్‌లో విచారణకు హజరయ్యారు. తాను నిర్దోషినని ఆ సమయంలో రాహుల్ చెప్పారు.
ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమైన వాదనలు
రాహుల్ గాంధీ హాజరు కావాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదుదారుడు చేసిన అభ్యర్థనపై గతేడాది మార్చిలో ప్రొసీడింగ్స్‌పై విధించిన మధ్యంతర స్టేను గుజరాత్ హైకోర్టు తొలగించిన అనంతరం పరువు నష్టం కేసులో తుది వాదనలు ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో ఈ కేసు తుది తీర్పు కోసం న్యాయస్థానం గురువారం సిద్ధమైంది. రాహుల్ గాంధీ కూడా ఉదయమే కోర్టుకు చేరుకున్నారు. అనంతరం రాహుల్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
నా సోదరుడు భయపడడు : ప్రియాంక
రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశాడనీ నిరూపించడానికి రాహుల్ ప్రసంగానికి సంబంధించిన సీడీలు, పెన్‌డ్రైవ్ ఉన్నాయని పూర్ణేశ్ మోడీ అన్నారు. రాహుల్ ప్రసంగాలు చాలా వరకు ప్రధానిని లక్ష్యంగా చేసుకొని ఉన్నందున నరేంద్ర మోడీ ఫిర్యాదుదారు అయి ఉండాల్సిందనీ, పూర్ణేశ్ మోడీ కాదని రాహుల్ తరఫు న్యాయవాది అన్నారు. కోర్టు తీర్పు అనంతరం రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ స్పందించారు. '' నా సోదరుడు ఎప్పుడూ భయపడలేదు. భయపడడు కూడా..'' అని ఆమె ట్వీట్ చేశారు.