Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూఢిల్లీలో టెన్షన్...టెన్షన్...
- రాష్ట్రపతి భవన్‌కు ప్రతిపక్ష ఎంపీల మార్చ్
- అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ : దేశంలోని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ ప్రతిపక్ష ఎంపీలు నినదించారు. అదానీ కుంభకోణంపై పార్లమెంట్లో చర్చ జరగాలనీ, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలనీ, ప్రతిపక్షాలపై కేంద్ర సంస్థలతో అణచివేత చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు మార్చ్ నిర్వహించారు. 'ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అనే బ్యానర్ పట్టుకొని, 'సేవ్ ఎల్ఐసి, జేపీసీ వేయాలి' అని ప్లకార్డులు చేబూని పార్లమెంట్ నుంచి ఎంపీలు ప్రదర్శనగా వెళ్లారు. విజరు చౌక్ వద్ద ఎంపీలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మార్చ్‌ను అడ్డుకునేందుకు వేలాది మంది పోలీసులు
మార్చ్ ముందుకు కొనసాగకుండా మగ పోలీసుల బదులు మహిళా పోలీసులను బారికేడ్ల వద్ద ఉంచారు. ఎంపీలను అడ్డుకునేందుకు వేలాది మంది పోలీసులు, కేంద్ర బలగాలు, వందల సంఖ్యలో బారికేడ్ల ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, బీఆర్ఎస్, ఆప్, డీఎంకే, శివసేన, ఎస్పీ, జేడీయూతో పాటు ఇతర పార్టీల ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉమ్మడిగా చేపట్టే ఆందోళనలకు టీఎంసీ మాత్రమే ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నది.
వారి గురించి మోడీ ఒక్క మాటా మాట్లాడలేదు : ఖర్గే
దేశాన్ని దోచుకున్న లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల గురించి ప్రధాని ఒక్క మాట కూడా అనడం లేదనీ, స్పీకర్‌కు లేఖ ఇచ్చినా రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతించలేదని కాంగ్రెస్ నేత మల్లికార్జన్ ఖర్గే విమర్శించారు. దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ అంతమైపోయిందనీ, త్వరలోనే నియంతత్వ పాలన వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రజల గొంతులను అణచివేసేందుకు ప్రభుత్వం కేసులతో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటున్నదని ఆరోపించారు.
ఉభయ సభల్లో ఆందోళన
''మోడీ-అదానీ భాయ్ భాయ్, మాకు జేపీసీ కావాలి'' వంటి ప్రతిపక్ష ఎంపిల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. పార్లమెంట్లో అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం, రాహుల్ గాంధీకి జైలు శిక్ష తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీ ఎంపీలు శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే సభలు వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్‌సభ ఆర్థిక బిల్లుని ఆమోదించింది.