Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలక పార్టీ పార్లమెంట్‌ను స్తంభిపంచేయడంపై ఏచూరి విమర్శ
హౌషియార్పూర్ : సర్దార్ భగత్‌సింగ్, రాజగురు, సుఖ్దేవ్ల 92వ అమరవీరుల దినోత్సవం, గొప్ప కమ్యూనిస్టు నేత, సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ 107వ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవాల 75ఏండ్ల పండుగను పురస్కరించు కుని పంజాబ్‌లోని హౌషియార్పూర్లో గురువారం బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని, దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళి అర్పించారు. బ్రిటిష్ కాలం నాటి పాత డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ చారిత్రక ప్రదేశంలో ర్యాలీని నిర్వహించినందుకు పంజాబ్ పార్టీని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి అభినందించారు. సర్దార్ భగత్ సింగ్ యువ శక్తికి ప్రతీక అని, అనేక తరాలకు స్ఫూర్తిని అందించారని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు కూడా ఆయన నుండి స్ఫూర్తి పొందారని అన్నారు. మనం రాజకీయ స్వేచ్చ పొందవచ్చు కానీ, ప్రతి ఒక్క పౌరుడు ఆర్థిక స్వేచ్ఛ పొందనిదే రాజకీయ స్వేచ్ఛ సంపూర్ణం కాదని భగత్ సింగ్ ఎల్లప్పుడూ చెబుతూ వుండేవారని ఏచూరి పేర్కొన్నారు. అవిశ్రాంతంగా మనం జరిపే పోరాటాల ద్వారా ఈ స్వేచ్ఛను సాధించడానికి కమ్యూనిస్టులుగా మనం కృషి చేస్తూనే వున్నామన్నారు. సంపన్నులు, పేదల మధ్య చాలా వ్యత్యాసం వుందని, ఒక శాతం భారత కార్పొరేట్లు 44.5శాతం జాతీయ ఆస్తులపై నియంత్రణను కలిగివున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థల రుణాలను రూ.11లక్షల కోట్ల మేరకు మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు.
పార్లమెంట్ కార్యకలాపాలను పాలక పార్టీ స్తంభింప చేయడం ఇదే మొదటిసారని ఏచూరి అన్నారు. పార్లమెంట్ కార్యకలాపాలను బీజేపీ స్తంభింపచేయడం వెనుక గల అసలైన కారణం విదేశాల్లో రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ కాదని, అదానీ కుంభకోణాల నుంచి దేశం దృష్టిని మళ్ళిం చాలనీ, ఈ కుంభకోణంలో జేపీసీ దర్యాప్తును నివారిం చాలని వారు అనుకున్నారని ఏచూరి విమర్శించారు. మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లైతే, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసినట్లైతే, కోట్లాదిమంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఆయన ఖండించారు. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకున్నా దాన్ని జాతి వ్యతిరేక చట్టంగా బీజేపీ, పోలీసు బలగాలు పేర్కొంటున్నా యన్నారు. 'మోడీ హటావో దేశ్ బచావో' అన్న పోస్టర్లపై ఢిల్లీ పోలీసులు 200 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని ఏచూరి వెల్లడించారు. మొత్తంగా 3500 ఈడీ కేసుల్లో కేవలం 23 కేసులు మాత్రమే కోర్టు విచారణకు వెళ్ళాయని చెప్పారు. గో సంరక్షకుల ముసుగులో మతోన్మాద దుండగులు కారులో ఇద్దరు ముస్లిం యువకులను సజీవ దహనం చేసిన ఘాతు కాన్ని గుర్తు చేస్తూ, మతోన్మాదమనే విషాన్ని వ్యాప్తి చేస్తున్న ఫాసిస్ట్ సంస్థ ఆర్ఎస్ఎస్ అని ఏచూరి విమర్శించారు.
'హిందూ ముస్లిం, సిక్, ఇసాయి, చారోమ్ భారత్ కే సిపాయి'' వంటి నినాదాలను చేసేవారమంటూ ఏచూరి తన స్కూలు రోజులను గుర్తు చేసుకున్నారు. 1980ల్లో పంజాబ్‌లో మతోన్మాద, తీవ్రవాద శక్తులపై పోరాట సమయంలో 200మందికి పైగా సీపీఐ(ఎం) కార్యకర్తలు, నేతలు తమ ప్రాణాలను త్యాగంచేశారని అన్నారు. న్యాయవ్యవస్థపై నిరంతరంగా దాడి చేస్తున్న బీజేపీ మంత్రులను, నేతలను ఏచూరి విమర్శించారు. సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియమకానికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని చారిత్రకమైనదని, ఎన్నికల ప్రజాస్వామ్య క్రమాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్య అని ఏచూరి వ్యాఖ్యానించారు. రైతాంగాన్ని అభినందిస్తూ, సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీలో సాగించిన పోరాటం చారిత్రకమై నదని అభివర్ణించారు. ఇటీవల మహారాష్ట్ర రైతులు సాగించిన లాంగ్ మార్చ్‌ను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ పోరాటాలు, ఉద్యమాలు ప్రభుత్వాలను తల వంచేలా చేశాయన్నారు. బీజేపీ, మోడీకి చెందిన కొద్దిమంది పెట్టు బడి దారులైన మిత్రులు గరిష్టంగా లాభాలు ఆర్జించేందుకు గానూ 80శాతానికి పైగా ప్రజలను ఆర్థిక దోపిడికి గురి చేస్తున్నారని, దీన్నుండి, మతోన్మాదం నుంచి దేశాన్ని కాపా డేందుకు ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వంలోని మతో న్మాద, కార్పొరేట్ కూటమికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని ఏచూరి పిలుపిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల నాయకత్వం ఒకే వేదికపైకి వచ్చేలా ఒత్తిడి తీసుకువచ్చింది ప్రజలేనని, 1977లో జరిగింది అదేనని ఏచూరి గుర్తు చేసుకున్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సుఖ్విందర్ సింగ్ షెకాన్, మాజీ కేంద్ర మంత్రి, దేశ్ భగత్ యాద్గర్ కమిటీ ప్రధాన కార్యదర్శి బల్వంత్ సింగ్ రామూవాలియాలు కూడా ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. సభకు అధ్యక్ష వర్గంగా కామ్రేడ్స్ భూప్ చంద్ చన్నో, గురుదర్శన్ సింగ్‌లు వ్యవహరించారు. కామ్రేడ్ గుర్నీక్ సింగ్ భజ్జాల్ కార్యక్రమాలను నిర్వహించారు.
1932 మార్చి 23న భగత్సంగ్, రాజగురు, సుఖ్దేవ్ల మొదటి సంస్మరణ దినం సందర్భంగా డిప్యూటీ కమిషనర్ కార్యాలయం పైన ఎగురుతున్న బ్రిటిష్ పతాకాన్ని తొలగించి, భారతీయ త్రివర్ణ పతాకాన్ని కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ ఎగురవేశారు. అప్పటికి సూర్జిత్ వయస్సు కేవలం 16సంవత్సరాలు.
ఈ సంఘటనతో డిసి ఆఫీసు అంతా గందరగోళం నెలకొంది. మిలటరీ సిబ్బంది ఆ యువకుడిని పట్టుకున్నారు. వెంటనే కాల్చేయాలని అనుకున్నారు. కానీ, అప్పటి డిప్యూటీ కమిషనర్, యువకుడైన సూర్జిత్‌ను కాల్చేయకుండా అరెస్టు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆ యువకుడిని ప్రశ్నిస్తూ పేరేంటని అడిగారు. దానికి లండన్టోడ్ సింగ్ (బ్రేకర్ ఆఫ్ లండన్) అని మన సూర్జిత్ బదులిచ్చాడు. ఆ తర్వాత సూర్జిత్‌కు మూడేళ్ళ జైలుశిక్ష విధించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కాంగ్రెస్‌పార్టీ మాజీ మంత్రి, హాకీ ఒలింపియన్ పర్గత్ సింగ్ ప్రసంగిస్తూ, కామ్రేడ్ సూర్జిత్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీని, కొన్నిసార్లు కాంగ్రెస్‌ను ఏకాకిని చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకత్వాలను ఏకం చేసి ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఘనత సూర్జిత్దేనని పేర్కొన్నారు.