Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీపీఎల్ జాబితాలో కొత్తగా 1359 కుటుంబాలు
- 'అభివృద్ధి చెందిన గుజరాత్'లో రెండేండ్లలో ఇదీ పరిస్థితి
- ఇప్పటికీ 31.67 లక్షలకు పైగా బీపీఎల్ కుటుంబాలు
- రాష్ట్ర ప్రభుత్వం సమాచారం
అహ్మదాబాద్: అభివృద్ధి విషయంలో దేశానికి గుజరాత్ ఒక మోడల్ అంటూ ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గురించి పలు సందర్భాల్లో, అనేక వేదికల్లో ప్రచారం చేసుకున్నారు. అయితే, ఆ రాష్ట్రంలో మాత్రం పేదరికం పెరుగుతున్నది. దారిద్య్ర రేఖకు దిగువ (బీపీఎల్) ఉన్న కుటుంబాల సంఖ్య గత రెండేండ్లలో పైకి ఎగబాకింది. శాసనసభలో గుజరాత్ ప్రభుత్వం అందించిన సమాచారంతో ఈ విషయం వెల్లడైంది.
రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ప్రకారం.. గత రెండేండ్లలో బీపీఎల్ జాబితాలో 1359 కుటుంబాలు వచ్చి చేరాయి. గుజరాత్లో 2023 జనవరి 31 నాటికి రాష్ట్రంలో 31.67 లక్షలకు పైగా బీపీఎల్ కుటుంబాలు ఉన్నాయి. 20 ఏండ్ల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం బీపీఎల్ కార్డు హౌల్డర్ల సంఖ్య పెరగడంపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
అట్టడుగుకు చేరని ఆదాయం
గుజరాత్ ప్రభుత్వం ఈ సమయంలో కొత్త సర్వే నిర్వహిస్తే ప్రస్తుతం ఉన్న బీపీఎల్ కుటుంబాల సంఖ్య పెరగొచ్చని వారు తెలిపారు. '' గుజరాత్ అభివృద్ధి చెందిన రాష్ట్రమనీ, ఈ రాష్ట్రాన్ని దేశానికి, ప్రపంచానికి మోడల్‌గా చూపుతున్నపుడు రాష్ట్రంలో ఇంత సంఖ్యలో పేద కుటుంబాలు ఉండటం బాధాకరం'' అని ప్రొఫెసర్, ఆర్థికవేత్త హేమంత్ కుమార్ షా అన్నారు. గుజరాత్ ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నదనీ, అయితే ఆ ఆదాయం గుజరాత్ సమాజంలోని అట్ట డుగు ప్రజలకు ఇంకా చేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాల సంఖ్య పెరిగిందని చెప్పారు.
20 ఏండ్ల క్రితం చివరి సర్వే
గుజరాత్ ప్రభుత్వం 20 ఏండ్ల క్రితం బీపీఎల్ కుటుంబాలపై చివరిసారిగా ఒక సర్వే నిర్వహించిందనీ, అయితే కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ సర్వే చాలా అవసరమని సూచించారు. బీపీఎల్ జాబితా సర్వే 2002-2003లో పూర్తయిందన్న విషయాన్ని రాష్ట్ర శాసన సభలో గుజరాత్ ప్రభుత్వం అంగీకరించింది. ''1999-2000లో పేద కుటుంబాల సంఖ్య 26.19 లక్షలు. ఇప్పుడు అది 31 లక్షలకు పెరిగింది. కాబట్టి 22 ఏండ్ల వ్యవధిలో బీపీఎల్ కుటుంబాల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం కొత్త సర్వే నిర్వహిస్తే నేను మరో ఐదు లక్షల కుటుంబాలు అదనంగా వచ్చి చేరుతాయని కచ్చితంగా అనుకుంటున్నాను. కరోనా మహమ్మారి కారణంగా మధ్యతరగతి పరిస్థితి క్షీణిస్తున్నది. వారు చాలా అప్పుల పాలయ్యారు'' అని హేమంత్ కుమార్ షా అన్నారు.
అమ్రేలీ జిల్లాలో బీపీఎల్ కుటుంబాలు అధికం
ప్రభుత్వ సమాచారం ప్రకారం అధికంగా అమ్రేలీ జిల్లాలో కొత్తగా 425 కుటుంబాలు బీపీఎల్ జాబితాలో వచ్చి చేరాయి. 2021లో ఈ సంఖ్య 309, 2022లో 116 గా ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో గిరిజనులు అధికంగా ఉండే సబర్కాంత (301 కుటుంబాలు), బనస్కాంత (199), ఆనంద్ (168), జునాగఢ్ (149) జిల్లాలున్నాయి. భారత్‌లో గ్రామీణ ప్రాంతాలలో రోజువారీ ఖర్చు రూ. 27.2, పట్టణ ప్రాంతాల్లో రూ. 33.3 ను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టుగా పరిగణిస్తారు.