Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లలో రూ.94వేల కోట్లకు కన్నం
న్యూఢిల్లీ : భారత్‌లో రుణాల ఎగవేతలు భారీగా పెరుగుతున్నాయి. కేవలం రెండేండ్లలోనే ఉద్దేశపూర్వకం గా ఎగవేసిన రుణాలు 38.5 శాతం లేదా 11.4 బిలియన్ డాలర్లు (దాదాపు 94వేల కోట్లు) పెరిగియని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్ట్ చేసింది. 2022 డిసెంబర్ ముగింపు నాటికి 15,778 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు 41.3 బిలియన్ డాలర్ల (రూ.3.4 లక్షల కోట్లు) అప్పులు ఎగవేశారు. ఇంతక్రితం ఏడాది ఇదే సమయానికి 14,206 మంది లేదా సంస్థలు 34.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.80 లక్షల కోట్లు) రుణాలు కావాలని ఎగ్గొట్టారు. సిబిల్ గణంకాల ప్రకారం.. 2020 డిసెంబర్ ముగింపు నాటికి 12,911 మంది ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు 29.8 బిలియన్ డాలర్ల (రూ.2.45 లక్షల కోట్లు) అప్పులను బ్యాంక్‌లకు చెల్లించలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1,883 మంది ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు 9.6 బిలియన్ డాలర్ల (రూ.79వేల కోట్ల)కు ముంచారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 4.6 బిలియన్ డాలరు (రూ.38వేల కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 4.27 బిలియన్ డాలర్లు (రూ.35వేల కోట్లు) ఎగ్గొట్టారు. అనేక మంది కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలకు తీసుకున్న రుణాలు చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ తిరిగి తీర్చడానికి ఆసక్తి చూపడం లేదు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని డిఫాల్టర్లు లభ్ది పొందుతున్నారు. వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సి పలు బ్యాంక్‌లకు 951 మిలియన్ డాలర్లు (రూ.7800 కోట్లు) ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. డిఫాల్టర్లలో చోక్సీ అగ్రస్థానంలో ఉన్నారు. ఎబిజి షిప్‌యార్డ్, రోటోమాక్ గ్లోబల్, ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్, రే ఆగ్రో వంటి ఇతర పెద్ద కంపెనీలు, వాటి ప్రమోటర్లు బ్యాంక్‌లకు అధికంగా కన్నం వేసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. ఈ అప్పుల వసూలు కోసం రికవరీ ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. దివాలా ప్రక్రియ కూడా నడుస్తుందన్నారు.