Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎంఓ ఫేక్ బృందంతో కుమారుడికి సంబంధాల ఫలితం
- ముఖ్యమంత్రికి రాజీనామా సమర్పించిన హితేశ్ పాండా
అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)కు చెందిన సీనియర్ అధికారి హితేశ్ పాండా రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు చెందిన బృందంగా చెప్పుకుంటూ తిరిగిన నకిలీ టీమ్‌లో హితేశ్ కుమారుడు అమిత్ హితేశ్ పాండ్యా భాగం కావడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో హితేశ్ పాండ్యా తన రాజీనామాను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు సమర్పించారు. గుజరాత్ సీఎం పీఆర్ఓగా 2001 నుంచి పాండ్యా పని చేస్తున్నారు. తన కుమారుడు అమాయకుడైనప్పటికీ.. పీఎంఓ, సీఎంఓల ప్రతిష్టకు భంగం వాటిళ్లకూడదనే తాను కోరుకుంటున్నాని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
కిరణ్ భారు పటేల్ నేతృత్వంలో టీం పీఎంఓకు చెందిన బృందంగా చలామణి అయింది. పీఎంఓ బృందం హోదాలో జమ్మూకాశ్మీర్‌లో పర్యటించింది. జెడ్ ప్లస్ భద్రతనూ పొందింది. ఫైవ్‌స్టార్ హోటల్లో సైతం బస చేసింది. వీటితో పాటు అధికారికంగా ఎన్నో సేవలనూ ఈ నకిలీ బృందం పొందింది. అయితే, ఈనెల ఆరంభంలో కిరణ్ భారు పటేల్ అరెస్టుతో నకిలీ బృందం బాగోతం వెలుగులోకి వచ్చింది.
అమిత్ పాండ్యా గుజరాత్‌లోని అధికార బీజేపీకి చెందిన వ్యక్తి. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది. గుజరాత్‌లోని నార్త్ జోన్‌కు పార్టీ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ ఇంచార్జీగా ఆయన ఉన్నారు. అయితే, ఫేక్ పీఎంఓ టీమ్ కేసులో అమిత్ పాండ్యాను జమ్మూకాశ్మీర్ పోలీసులు నిందితుడిగా పేరు చేర్చకపోవడం గమనార్హం. బదులుగా అమిత్, గుజరాత్‌కే చెందిన ఆయన అనుచరుడు జే సితపారాలను ఈ కేసులో సాక్షులుగా చేర్చారు.
పీఎంఓ సీనియర్ అధికారిగా చెప్పుకొని కిరణ్ భారు పటేల్ నాలుగు నెలలకు పైగా అధికారిక ప్రోటోకాల్‌ను అనుభవించారు. కిరణ్ పటేల్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అమిత్, జే సితపారాలను విడిచిపెట్టారు. అయితే, ఈ ఇద్దరూ కిరణ్ బృందం ట్రాప్‌లో పడుండొచ్చని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించడం గమనార్హం. నియంత్రణ రేఖ గుండా ఉన్న పోస్టులతో పాటు అనేక ప్రదేశాలను కిరణ్ సందర్శించాడు. కాశ్మీర్‌లోని అనేక జిల్లాల అధికారులతోనూ పీఎంఓ నకిలీ బృందం సమావేశాలు జరిపింది. తాను తన కొడుకును నమ్ముతున్నాననీ, అలాంటి కార్యక్రమాల్లో అతను ఎన్నడూ భాగం కాలేదని హితేశ్ పాండ్యా వెల్లడించాడు. కిరణ్ పటేల్ ట్విట్టర్ ఖాతా కూడా వెరిఫైడ్ అకౌంట్ కావడం గమనార్హం. ఈ ఖాతాకు వేలాది మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో బీజేపీ గుజరాత్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సిన్హ్ వాఘేలా కూడా ఉండటం గమనార్హం. కాశ్మీర్లో పారామిలిటరీ గార్డులు తన చుట్టూ ఉండే తన 'అధికారిక పర్యటనలు'కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పటేల్ ఈనెల 2న తన చివరి ట్వీట్లో పోస్ట్ చేయడం గమనార్హం.