Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిరంగ చర్చ జరిపే హక్కు కూడా లేదా?
- ఎన్ఆర్ఈజీఏపై శాంతియుత నిరసనకు ఢిల్లీ పోలీసుల అడ్డు
- సామాజిక కార్యకర్తల ఆందోళన
న్యూఢిల్లీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఏ) మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్సిటీ ఆర్ట్స్ ఫ్యాకల్టీ బయట విద్యార్థులు, కార్మికులతో తాము చేపట్టిన శాంతియుత నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులు వ్యవహరించిన తీరును వారు తప్పుబట్టారు. ఈ మేరకు నిరసనకారులతో ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరు ఎలా ఉందో తెలియజేసే ఒక వీడియోను ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా ట్విట్టర్లో షేర్ చేసింది. నిరసన ప్రదేశాన్ని వదిలి వెళ్లాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్న తీరు అందులో ఉన్నది. ఆ నిరసన ప్రదర్శనలో సామాజిక కార్యకర్తలు జీన్ డ్రీజ్, రిచా సింగ్‌లు కూడా పాలుపంచుకున్నారు.
ఎన్ఆర్ఈజీఏలో తీసుకొచ్చిన ఆన్లైన్ హాజరు విధానం, ఆధార్ ఆధారిత చెల్లింపులు వంటి మార్పులకు వ్యతిరేకంగా గత నెల పాటుగా ఉపాధి కార్మికులు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. సామాజిక కార్యకర్త సోమ్‌నాథ్, యూఎస్ నుంచి వచ్చిన విద్యార్థి, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ తెలిపింది. వారిని నగర మౌరీస్ నగర్ సైబర్ సెల్ పోలీసు స్టేషన్‌కు తరలించారని చెప్పింది. పేదలకు కఠినంగా మారే అంశాలపై బహిరంగా చర్చ జరగడానికి యత్నిస్తున్న శాంతియుత నిరసనకారుల హక్కును యంత్రాంగాలు అణచివేస్తున్నాయని ఆరోపించింది. ప్రజా సమస్యపై బహిరంగంగా చర్చించే హక్కును పౌరులు కలిగి లేరా? అని ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా తన ట్వీట్లో ప్రశ్నించింది. ''తమ ప్రాథమిక హక్కులను వాడుకున్న విద్యార్థులు, కార్యకర్తలు, కార్మికులను ఎందుకు అరెస్టు చేస్తున్నారు? ఇది ప్రజాస్వామ్య భావనపై దాడి'' గా అభివర్ణించింది.నిరసనలు శాంతికి విఘాతం కలిగిస్తాయనే భయాన్ని వ్యక్తం చేస్తూ యూనివర్సిటీ.. తమను ఆశ్రయించిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు కాలేదనీ, స్పాట్ వద్ద గుమిగూడిన 11 మంది విద్యార్థులను ''శాంతియుతంగానే తరలించాం'' అని చెప్పారు. నిరసన చేసుకోవడానికి తమకు ముందస్తు అనుమతి ఉన్నప్పటికీ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో ఉన్న ఎన్ఆర్ఈజీఏ కార్మికులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఆప్, బీజేపీ లు నిర్వహించే ర్యాలీలు, కార్యక్రమాల కోసం దారి ఇవ్వాలనీ, నిరసన చేస్తున్న ప్రదేశాన్ని విడిచి వెళ్లాలని ఆ సమయంలో తమకు ఆదేశాలు జారీ అయ్యాయని ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా ఆరోపించింది.