Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుస్థితిలో 43 లక్షల మంది
- పెరుగుదల సమస్యలతో సతమతం :లోక్‌సభలో కేంద్రం
న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశంలోని చిన్నారులు పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు. భారత్‌లో దాదాపు 43 లక్షల మంది పిల్లలు ఈ సమస్యతో బాధ పడుతున్నారు. లోక్‌సభలో సాక్షాత్తూ కేంద్రమే ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లిఖితపూర్వకంగా సభకు సమాధానాన్ని అందించారు.
ఈ సమాచారం ప్రకారం.. మిషన్ పోషన్ కింద 'పోషన్ ట్రాకర్' ప్రకారం ఫిబ్రవరిలో 5.6 కోట్ల మంది చిన్నారుల్లో 43 లక్షల మంది (7.7 శాతం మంది) పోషకాహార లోపాన్ని (మధ్యస్థం మరియు తీవ్రం) కలిగి ఉన్నట్టు గుర్తించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) సమాచారాన్ని కేంద్ర మంత్రి సభతో పంచుకున్నారు. ఈ సమాచారం ప్రకారం.. దేశంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో పెరుగుదల సమస్యలున్నాయి. వయసుకు తగిన ఎత్తు లేనివారు 35.5శాతం, ఎత్తుకు తగిన బరువు లేని వారు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉన్నవారు 32.1 శాతం మంది ఉన్నారు. తక్కువ బరువును కలిగి ఉన్న మహిళల సంఖ్య 18.7 శాతంగా ఉన్నది. ఐదేండ్లలోపున్న 7.7 శాతం మంది చిన్నారులు ఎత్తుకు తగిన బరువు లేకపోవడం తీవ్రంగా ఉన్నది.
వయసుకు తగిన ఎత్తు లేని చిన్నారులు ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో అత్యధికంగా 46.5 శాతం మంది ఉన్నారు. ఈ విషయంలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి తక్కువగా 20 శాతం మంది చిన్నారులను కలిగి ఉన్నది. ఎత్తుకు తగిన బరువులేని ఐదేండ్ల లోపు చిన్నారులు అత్యధికంగా మహారాష్ట్రలో 25.6 శాతం మంది ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో తక్కువగా 8.4 శాతం మంది ఉన్నారు. తక్కువ బరువున్న చిన్నారుల సంఖ్య బీహార్‌లో అత్యధికంగా 41 శాతంగా ఉన్నది. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఈ సంఖ్య తక్కువగా 12.7 శాతంగా ఉన్నది.
దేశంలోని చిన్నారులు, మహిళల ఆరోగ్యం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ వహించాలని సామాజిక కార్యకర్తలు, ఆరోగ్య నిపుణులు సూచించారు. సంబంధిత విభాగాలకు అధిక నిధులను కేటాయించి, పథకాలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా పేద చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.