Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదానీ డొల్ల కంపెనీలకు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయి?
దాని గురించి అడిగినందుకే నాపై అనర్హత వేటు..మోడీ కండ్లల్లో భయం చూశా..
న్యూఢిల్లీ : మోడీ కండ్లలో మొదటిసారి భయం చూశా. నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు . అసలు''అదానీ డొల్ల కంపెనీలకు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయి?.దాని గురించి ప్రశ్నించినందుకే నాపై అనర్హత వేటు వేశారు. నేను ఎవ్వరికీ భయపడను. అనర్హత వేటు వేసినా, జైలుకు పంపినా తగ్గేదేలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా'' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని పేర్కొన్నారు. అనర్హత వేటు తరువాత శనివారం రాహుల్ గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. అదానీపై తన తదుపరి ప్రసంగం ఎలా ఉంటుందోనని ప్రధామంత్రికి భయం పట్టుకున్నదనీ, ఆ భయం ప్రధాని మోడీ కండ్లలో తాను చూశానని రాహుల్ గాంధీ అన్నారు. అందువల్లే తొలుత తనపై వక్రీకరణలు చేశారనీ, ఇప్పుడు అనర్హత వేటు వేశారని విమర్శించారు. ''అదానీ వ్యవహారంలో ఆధారాలను నేను పార్లమెంట్‌కు తెలియజేశాను. లోక్‌సభలో నా ప్రసంగాన్ని కేంద్రం కావాలనే తొలగించింది. స్పీకర్‌కు అన్ని ఆధారాలు ఇచ్చా. స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు నాకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారు. నేను ఎవ్వరికీ భయపడను. అదానీ డొల్ల కంపెనీల్లోకి పెట్టుబడులు ఎవరు పెట్టారు? దీనిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి. అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన డొల్ల కంపెనీలు రక్షణ రంగంతో ముడిపడి ఉన్నాయి. ఒక చైనా జాతీయుడికి కూడా ఈ పెట్టుబడులతో సంబంధం ఉంది. అందుకే ఆ పెట్టుబడుల వివరాలేంటో చెప్పాలని అడిగాను. నా గురించి కేంద్ర మంత్రులు పార్లమెంటులో అబద్ధాలు చెప్పారు. లండన్ ప్రసంగంపై మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పటి నుంచే, అదానీతో మోడీకి సంబంధాలున్నాయి. ఇది ఓబీసీల వ్యవహారం కాదు. ఇది మోడీ-అదానీల వ్యవహారం. దానినుంచి దృష్టి మళ్లించడం కోసం విదేశాల్లో నా వ్యాఖ్యల గురించి మాట్లాడతారు. అనర్హత అంశాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఓబీసీ అంటారు'' అని ధ్వజమెత్తారు.
మోడీ, అదానీ దేశాన్ని ఎలా వంచిస్తున్నారో జనానికి తెలియజేస్తా..
అదానీ వంటి వ్యక్తులు ప్రధానితో తమకున్న సంబంధాలతో దేశాన్ని ఎలా వంచిస్తున్నారో ప్రజల ముందుకు వెళ్లి వివరిస్తానని అన్నారు. ''నాపై అనర్హత వేటు వేసినా.. జైలుకు పంపినా తగ్గేదేలే.. ఆటంకాలు సృష్టించినా వెనకడుగు వేసేది లేదు. నాకు జైలు శిక్షా..? ఐ డోంట్ కేర్..అనర్హతలు లాంటివి నన్ను ఏమి చేయలేవు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. నా పోరాటాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. మోడీని ప్రశ్నిస్తూనే ఉంటాను. నేను నిజం మాట్లాడతాను. మాట్లాడుతూనే ఉంటాను. ప్రజల్లోనే ఉంటాను. భారత్ జోడో యాత్రలో ప్రజల్లోకి వెళ్లాను. నేను దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను. పోరాడుతూనే ఉంటాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తివే అయితే నాకు మాట్లాడే అవకాశం లేకుండా ఎందుకు చేస్తున్నావు? ప్రజల ప్రజాస్వామిక గొంతు వినిపించేందుకు, కాపాడేందుకు నేనిక్కడ ఉన్నాను. రాజకీయ పార్టీలకు గతంలా మీడియా సంస్థల నుంచి లభించిన మద్ధతు ఇప్పుడు లేదు. అందుకే ప్రతిపక్షాలు ప్రజల దగ్గరకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు'' అని స్పష్టం చేశారు.
దేశమంటే అదానీయేనా?
''ప్రధాని ప్రతిపక్షాలకు ఒక గట్టి ఆయుధాన్ని ఇచ్చారు. ప్రధాని చర్యలతో ఆయన చేసిన తప్పు గురించి చర్చ జరుగుతోంది. అదానీ ఒక అవినీతి, అక్రమార్కుడని ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాంటి వ్యక్తిని ప్రధాని మోడీ ఎందుకు కాపాడాలని చూస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అదానీ గురించి అడిగితే.. దేశంపై దాడి అంటున్నారు. అంటే అదానీయే దేశమని ప్రధాని చెబుతున్నారా?'' అని రాహుల్ గాంధీ విమర్శించారు. ''దేశం నాకు ప్రేమ, ఆప్యాయత సహా అన్ని ఇచ్చింది. దేశం కోసం పోరాడతా. నేను దేశ న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. నాకు సంఘీభావం, మద్ధతు ప్రకటించిన ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు. అందరం కలసికట్టుగా పనిచేద్దాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, లేకున్నా. పార్లమెంటులో ఉన్నా, బయట ఉన్నా. నన్ను జైల్లో పెట్టినా. శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా సరే నా పని నేను చేసుకుంటూనే పోతాను. పార్లమెంటులో ఉన్నానా? లేనా? అనేది ప్రశ్న కాదు. దేశం కోసం పోరాటం సాగిస్తూనే ఉంటాను'' అని పేర్కొన్నారు. తన పేరు సావర్కర్ కాదని, గాంధీ అని, బీజేపీ ఎంపీల డిమాండ్ మేరకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రాహుల్ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేలా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, జైరాం రమేష్‌లు ఉన్నారు.