Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల కోత, యాప్ ఆధారిత హాజరుతో ఇక్కట్లు
- జనవరిలో పదిశాతం పడిపోయిన పని
- నెట్వర్క్, ఇతర సాంకేతిక సమస్యలే కారణం
- వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం
- ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పోర్టల్ సమాచారం
భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఉపాధికి హామీని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పని తీరు ఆశాజనకంగా కనిపించడం లేదు. ముఖ్యంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ చట్టాన్ని క్రమక్రమంగా నీరుగారుస్తున్నది. ఏటికేడూ బడ్జెట్లో కోతలు.. ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన యాప్ ఆధారిత హాజరుతో సాంకేతిక సమస్యలు.. లబ్దిదారులకు చెల్లింపులు ఆలస్యంగా జరపటం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పథకం ఆశించిన లక్ష్యాలను చేరడం లేదు. లబ్దిదారుల ఉపాధికి గండి కొడుతున్నది.
న్యూఢిల్లీ : ఇటీవల ఉపాధి హామీ చట్టంలో మోడీ ప్రభుత్వం అనేక మార్పులను తీసుకొచ్చింది. ఎప్పటిలాగే ఈ పథకానికి ఇటీవల బడ్జెట్లోనూ భారీ మొత్తంలో కోతలను విధించి తక్కువ మొత్తంలో నిధులను కేటాయించింది. మరోపక్క, ఉపాధి పథకం కింద పనిని పొందే కుటుంబాలు, లబ్దిదారుల హాజరు కోసం యాప్ ఆధారిత హాజరును ప్రవేశ పెట్టారు. ఫలితంగా ఉపాధి హామీ పని అవుట్‌పుట్ ఈ ఏడాది జనవరిలో కిందటి నెలతో పోల్చితే పది శాతం పడిపోయింది. ఆ ట్రెండ్ ఫిబ్రవరిలో, మార్చిలోనూ కొనసాగుతున్నది. మార్చిలో ఇది మరింత దారుణానికి పడిపోయింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పోర్టల్‌లో ఈ విషయం వెల్లడైంది.
వెబ్ పోర్టల్ సమాచారం ప్రకారం.. గతేడాది డిసెంబర్లో 1.85 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధిని పొందాయి. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి జాతీయ మొబైల్ పర్యవేక్షణ సేవ (ఎన్ఎంఎంఎస్) యాప్ ద్వారా హాజరును తప్పనిసరి చేశారు. దేశంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు లేకపోవడంతో లబ్దిదారులు తమ హాజరు కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పని చేసినప్పటికీ యాప్‌నకు సంబంధించి, ఇతర సాంకేతిక కారణాల కారణంగా యాప్ అటెండెన్స్‌లో వారు హాజరుకానట్టు చూపిస్తున్నది. దీంతో ఇప్పటి వరకు దాదాపు ఈ మూడు నెలల కాలంలో పనిలో తగ్గుదల కనిపించింది. ఈ తగ్గుదల కాలం(సీజనల్) ద్వారా వచ్చే తగ్గుదల కాదని విశ్లేషకులు తెలిపారు. యాప్ ఆధారిత హాజరులో లోపాలే పని తగ్గుదలకు కారణమై ఉండొచ్చని చెప్పారు. గత గణాంకాలను చూస్తే సాధారణంగా డిసెంబర్ మాసంతో పోలిస్తే జనవరి, ఫిబ్రవరి నెలల్లో పథకం కింద పని పెరుగుదల ఉంటుంది. 2018-19 గణాంకాల ప్రకారం.. 2018 కంటే 2019 జనవరిలో పని పెరుగుదల 9 శాతం నమోదు కావడం గమనార్హం.
16 శాతం మందికి అందని పని
ఇక తాజా గణాంకాలను చూస్తే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (మార్చి 25 నాటికి) పథకం కింద దాదాపు 10.24 కోట్ల మంది వ్యక్తులు పనిని కోరారు. వీరిలో 8.6 కోట్ల మంది పనిని పొందారు. 1.64 కోట్ల మందికి పథకం మొండి చేయిని చూపింది. పని కోరుకున్నవారిలో వీరి సంఖ్య 16 శాతం కావడం గమనార్హం. గతేడాది డిసెంబర్లో 1.85 కోట్ల కుటుంబాలు ఉపాధిని పొందగా.. జనవరికి అది 1.67 కోట్లకు పడిపోయి ఫిబ్రవరిలోనూ అదే సంఖ్యను నమోదు చేసింది. ఇక మార్చిలో (25వ తేదీ నాటికి) అది 1.15 కోట్లకు పడిపోవడం గమనార్హం.
రూ. 3630 కోట్ల చెల్లింపులు ఆలస్యం
ఈ ఏడాది ఉపాధి కార్మికులకు చేసే చెల్లింపులు కోట్ల రూపాయల మేర పేరుకుపోవడం ఆందోళనను కలిగిస్తున్నది. గతేడాదితో పోలిస్తే బకాయిలు 64 శాతం పెరిగాయి. గతేడాది ఆలస్యంగా (16 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల తర్వాత) జరిపిన వేతనాల మొత్తం రూ. 2213 కోట్లుగా ఉంటే.. ఈ ఏడాది అది రూ. 3,630 కోట్లకు చేరటం గమనార్హం. ఇక నైపుణ్యం లేని కార్మికులకు పెండింగ్ బకాయిలు గతేడాది రూ. 424 కోట్లు ఉండగా.. అది ఈ ఏడాది రూ.1010 కోట్లకు (138 శాతం పెరుగుదల) చేరింది.
నిధుల తగ్గింపు
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకానికి జరిపిన కేటాయింపులు రూ. 73,000 కోట్లు. అలాగే, ఏడాదిపాటు జరిపిన అదనపు కేటాయింపులు కలుపుకొని బడ్జెట్ సవరణ అంచనా రూ. 89,400 కోట్లకు చేరింది. అయితే, 2021-22లో వాస్తవ బడ్జెట్ రూ. 98,467.85 కోట్ల కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన దాని కంటే రూ. 11,921 కోట్లు అధికంగా ఖర్చు కావడం గమనార్హం. అది అంతకు ముందు ఏడాది రూ. 4162 కోట్లుగానే ఉండటం గమనించాల్సిన అంశం.