Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రభుత్వంపై ఐక్య పోరాటం... ప్రజలపై భారాలు పెరుగుతున్నాయ్ : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వంపై ఐక్య పోరాటం చేస్తామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెండు రోజుల పాటు జరిగిన సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సమావేశాల నిర్ణయాలను ఏచూరి వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ముద్రించిన ''అదానీ బెలూన్ గ్యాస్ అయిపోతోంది'' అనే బుక్లెట్ను విడుదల చేశారు. ప్రతిపక్షాలను వేధించడానికి ఈడీ, సీబీఐ దుర్వినియోగంతో పాటు నేర పరువునష్టం మార్గాన్ని బీజేపీ ప్రభుత్వం ఎంచుకుందని ఏచూరి విమర్శించారు. ప్రజల విశ్వాసం ఉన్నదనీ, 2024 ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ ప్రభుత్వానికి నమ్మకం లేదని అన్నారు. అందువల్లనే ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడం వంటి చర్యలకు పూనుకుంటున్నదన్నదని దుయ్యబట్టారు.
సమాధానం చెప్పాల్సి వస్తుందనే ....
దేశంలో అదానీ గురించి ప్రతి రోజూ కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయనీ, ప్రజల సంపదను అదానీకి దోచిపెడుతున్నారని విమర్శించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే పార్లమెంట్ సజావుగా నడవకుండా ప్రభుత్వమే అడ్డుకుంటున్నదని చూస్తుందని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాధానం ఇవ్వకపోవడంతో అదానీ వ్యవహారంలో కుంభకోణం జరిగిందనీ, అందులో మోడీ ప్రభుత్వం జోక్యం ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. అలాగే పార్లమెంట్ సజావుగా నడిస్తే, ప్రజా సమస్యలను ప్రతిపక్షాలు లేవనెత్తుతాయని పేర్కొన్నారు.
అదానీని కాపాడేందుకే...
అదానీ సోదరుడి ఆధీనంలో ఉన్న విదేశీ డొల్ల కంపెనీలు, అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాయని విమర్శించారు. ఈ రూ.20 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం డొల్ల కంపెనీ ఎలా పని చేస్తున్నాయో పరిశీలించి, మార్గదర్శకాలు ఇవ్వాలని 2018లో ఒక టాస్క్ఫోర్స్ను నియమించిందని గుర్తు చేశారు. అదే ప్రభుత్వం అదానీ వ్యవహారం బయటపడిన తరువాత డొల్ల (షెల్) కంపెనీల గురించి నిర్వచనం లేదనీ, నిర్వచనం లేదు కనుక తమ వద్ద సమాచారం లేదని పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రభుత్వమే డొల్ల కంపెనీలను క్రమబద్ధీకరించేందుకు టాస్క్ఫోర్స్ నియమించి, ఇప్పుడు ఇదే ప్రభుత్వం డొల్ల కంపెనీలంటే తమకు తెలియదని అనడంలో అర్థమేమైనా ఉందా? అని ప్రశ్నించారు. అదానీని కాపాడేందుకు ప్రభుత్వం ఎంతలా దిగజారిందో స్పష్టంగా కనబడుతోందని తెలిపారు. సగానికిపైగా ఈడీ కేసులన్నీ డొల్ల కంపెనీలకు సంబంధించినవేననీ, కానీ ఇప్పుడు డొల్ల కంపెనీ అంటే ఏమిటో తెలియదని ప్రభుత్వం అంటుందని ఎద్దేవా చేశారు. దేశంలో మతోన్మాద ఘర్షణలు, మతోన్మాద దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలపై ఆర్థిక భారాలు పెరుగుతున్నాయనీ, వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఏపీలో నిర్మాణ సమస్యలు..
''ఆంధ్రప్రదేశ్ పార్టీలో కొన్ని నిర్మాణ సమస్యలు ఉన్నాయి. ఆయా నిర్మాణ, అంతర్గత సమస్యలపై పొలిట్ బ్యూరోలో చర్చించాం. అలాగే ఆయా సమస్యలపై నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని రాష్ట్ర కమిటీలో చర్చించి అమలు చేస్తాం. బివి రాఘవులు ఎన్నికైన పొలిట్ బ్యూరో సభ్యులు. ప్రస్తుతం కూడా ఆయన పొలిట్ బ్యూరో సభ్యులుగానే ఉన్నారు. కొనసాగుతారు. రాఘవులు సమస్య ఏమీ లేదు'' అని అన్నారు. రాఘవులు లేఖకు సంబంధించి తాను మీడియాతో ఏమీ చెప్పలేదనీ, కానీ తాను చెప్పినట్టు ఒక ఛానెల్ (ఏబీఎన్ ఛానెల్) ప్రసారం చేసిందని పేర్కొన్నారు. దేశంలో నేర పరువు నష్టం కేసులు నడుస్తున్నాయనీ, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తప్పుడు వార్తాలు ప్రసారం చేయొద్దని హితవు పలికారు. తాను ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఎంఎ గఫూర్ రాజీనామా చేసేందుకు ప్రయత్నించినట్టు వచ్చిన వార్తలపై విలేకరుల ప్రశ్నకు స్పందించిన ఏచూరి తమ వద్దకు అటువంటి సమాచారం ఏమీ రాలేదనీ, ఆయన మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడని అన్నారు. అసలు ఇలాంటి వార్తాలు మీకు ఎలా వస్తున్నాయని విలేకరులను ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యమయ్యాయనీ, రాబోయే రోజుల్లో ఐక్యత, ప్రజా పోరాటాలు పెరుగుతాయని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.