Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల దుస్తులతో నిరసన ర్యాలీ
- పార్లమెంట్లో కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
- రాజ్యసభలో ఆర్థిక బిల్లు ఆమోదం
న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు, అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు నల్ల దుస్తులు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించాయి. ''సత్యమేవ జయతే'' బ్యానర్ పట్టుకొని నినాదాలు చేస్తూ ప్రతిపక్ష నేతలు ప్రదర్శన చేపట్టారు. సోమవారం ఉభయ సభలు వాయిదా పడిన తరువాత ప్రతిపక్ష సభ్యులంతా పార్లమెంట్ ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని నినాదాల చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి విజయ్ చౌక్‌కు ప్రతిపక్ష సభ్యులు మార్చ్ నిర్వహించారు. 'యే దాదాగిరి బంద్ కరో, యే మోడీ గిరి బంద్ కరో' అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, బీఆర్ఎస్లకు చెందిన ఎంపీలు నలుపు రంగు దుస్తులు ధరించగా, టీఎంసీ ఎంపీలు నోటికి నల్ల బ్యాడ్జిలు కట్టుకొని ఆందోళనలో పాల్గొన్నాయి. 'జాగో ఈడీ', 'ఈడీ మోదానీ భారు భారు' అని రాసి ఉన్న ప్లకార్డులను ఎంపీలు పట్టుకొని మార్చ్‌లో కదంతొక్కారు.
దద్దరిల్లిన ఉభయ సభలు
సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లో రాహుల్ అనర్హత వేటు, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు హౌరెత్తించారు. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. దీంతో సోమవారం కూడా ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్‌సభలో సభ ప్రారంభం కాగానే కొంత మంది ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి కాగితాలను చించి విసిరారు. మరికొంత మంది ఎంపీలు నల్లరంగు క్లాత్‌ను ఊపారు. ఒక ఎంపీ చేతిలో ఉన్న బ్యానర్‌ను స్పీకర్ కుర్చీపైకి విసిరారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను స్పీకర్ ఓం బిర్లా సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. 'ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది' అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. పలువురు సభ్యులు వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చినా లోక్‌సభ స్పీకర్ అనుమతించేది చైర్లో ప్యానెల్ స్పీకర్ రమాదేవి తెలిపారు. వెంటనే సభను మంగళవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే తీరు కొనసాగింది. సభ ప్రారంభం కాగానే కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ''మోడీ-అదానీ భారు, భారు'' నినాదాలు చేశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో సభను ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల నినాదాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఆర్థిక బిల్లును ఆమోదించారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు.
ప్రతిపక్షాల సమావేశం
రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్,డీఎంకే, ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఆప్, బీఆర్ఎస్, ఎన్సీపీ, ఎన్సీ, శివసేన (ఠాక్రే), ఐయుఎంఎల్, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్,టీఎంసీ, ఆర్ఎస్పీ తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ముందుకు వచ్చిన వారికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలి : రాహుల్‌కు నోటీస్
లోక్‌సభ ఎంపీ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీ ప్రస్తుతముంటోన్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొంది. ఖాళీ చేయడానికి ఆయనకున్న వ్యవధి 26 రోజులు మాత్రమే. 2014 నుంచి రాహుల్ ఢిల్లీ 12 తుగ్లక్ లేన్‌లోని ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు.