Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే నిర్వాకం
- వేదికపై ముందు వరుసలో కూర్చున్న శైలేశ్ భట్
- స్పందించడానికి ఎంపీ జస్వంత్‌సిన్హ్ నిరాకరణ
- తాను చూడలేదన్న ఎమ్మెల్యే శైలేశ్భారు
- సోషల్‌మీడియాలో నెటిజన్ల ఆగ్రహం
అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలినవారిలో ఒకరైన శైలేశ్ భట్.. బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి గుజరాత్‌లోని ఒక ప్రభుత్వ కార్యక్రమంలో వేదిక పంచుకున్నాడు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ముందురుసలో కూర్చున్నాడు. వీటికి సంబంధించిన ఫోటోలను ఎమ్మెల్యే, ఎంపీలిద్దరూ తమ ట్విట్టర్ ఖాతాల్లో సైతం పోస్టు చేయటం గమనార్హం.
మాకు ఆశ్చర్యం అనిపించలేదు : బిల్కిస్ భర్త రసూల్
బీజేపీ ప్రజాప్రతినిధులతో వేదిక పంచుకున్నది శైలేశ్ భట్ అని బిల్కిస్ బానో భర్త యాకుబ్ రసూల్ కూడా ధ్రువీకరించాడు. ''వీరు (దోషులు) జైలు నుంచి బయటకు వచ్చినపుడు సత్కారాలు అందుకున్నారు. అధికారంలో ఉన్నవారితో వారు వేదిక పంచుకోవడం మాకు ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఇప్పుడు మాకున్న ఏకైక ఆశ సుప్రీంకోర్టే'' అని రసూల్ అన్నారు. మహిళపై సామూహిక లైంగికదాడి కేసులో దోషిగా తేలి.. ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉన్న వ్యక్తిని బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు తమ కార్యక్రమాల్లో భాగం చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి తీరు పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దహోడ్ జిల్లా సింగ్వడ్ తాలూకాలోని కర్మాడీ గ్రామంలో గుజరాత్ నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (జీడబ్ల్యూఎ స్ఎస్బీ) ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ దహోడ్ ఎంపీ జస్వంత్‌సిన్హ్ భభోర్, లిమ్ఖేడ ఎమ్మెల్యే శైలేశ్భారు భభోర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను భభోర్ సోదరిలిద్దరూ తమ ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశారు. దహోడ్ జిల్లా సమాచార విభాగం కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది.
నేను పాల్గొన్నది పబ్లిక్ ఈవెంట్ : శైలేశ్భట్
ఇందులో భట్.. వేదికపై ముందు వరుసలో జస్వంత్‌సిన్హ్, సింగ్వడ్ పంచాయతీ అధ్యక్షులు కాంతా దమోర్లకు మధ్యలో కూర్చున్నట్టు కనిపించింది. అయితే, తాను హాజరైన జీడబ్ల్యూఎస్ఎస్బీ కార్యక్రమం అనేది ఒక పబ్లిక్ కార్యక్రమమనీ, తాను ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదని భట్ మాట్లాడటం గమనార్హం. ఈ తతంగంపై మాట్లాడటానికి జస్వంత్‌సిన్హ్ నిరాకరించారు. ఎమ్మెల్యేగా తాను చాలా బిజీగా ఉండటం కారణంగా వేదికపై ఉన్నది ఎవరో తాను చూడలేదని శైలేశ్భారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భట్ వచ్చాడన్నదానిపై తాను పరిశీలిస్తానని తెలిపారు. వేదికపై ముందు వరుసలోనే కూర్చున్న భట్ తనకు కనిపించలేదని ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం.
భట్‌ను ఈ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానించారో తనకు తెలియదని జీడబ్ల్యూఎస్ఎస్బీ డిప్యూటీ ఇంజినీర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం మా ద్వారానే నిర్వహించబడినప్పటికీ.. నీటి సరఫరా విభాగం నుంచి ఆహ్వానాలు పంపలేదని చెప్పారు. పంచాయతీ సభ్యులే అతిథులను ఆహ్వానించి ఉండొచ్చని అన్నారు. బిల్కిస్ దోషి ఈ కార్యక్రమానికి హాజరుకావడంపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్ లాంటి 'క్రూరుడిని' తిరిగి జైలులో ఉంచాలని పేర్కొన్నారు.
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి కేంద్రం నోటీసు
బిల్కిస్ బానో కేసులో దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. దీంతో కోర్టు కేంద్రం, గుజరాత్ రాష్ట్రానికి, 11 మంది దోషులకు నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై వివరణాత్మక విచారణకు ఏప్రిల్ 18వ తేదీని ఖరారు చేసింది. విచారణ సందర్భంగా బెంచ్ 'దోషులు చేసిన నేరం భయంకరమైనదని, భావోద్వేగాలకు లోనుకాదు' అని వ్యాఖ్యానించింది.
విడుదల సంబంధిత ఫైళ్లను సిద్ధంగా ఉంచుకోండి
విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును బెంచ్ మినహాయింపు ఇచ్చే ముందు సంప్రదించారా? అని ప్రశ్నించింది. దీనిపై ఏఎస్జీ ధర్మాసనానికి ఈ విషయంలో కేంద్రాన్ని తగు విధంగా సంప్రదించినట్లు తెలిపారు. దీనిపై, తదుపరి విచారణ తేదీన దోషుల విడుదలకు సంబంధించిన అన్ని ఫైళ్లను సిద్ధంగా ఉంచాలని జస్టిస్ జోసెఫ్ గుజరాత్ రాష్ట్ర న్యాయవాదిని కోరారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేస్తూ, విచారణ ఏ పరిధిలో జరగాలనే విషయాన్ని ముందుగా నిర్ణయిస్తామని కోర్టు స్పష్టం చేసింది.