Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష నేతలపై వేధింపులకు ఖండన బీజేపీ వైఖరికి నిరసన
న్యూఢిల్లీ : ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీలో సమావేశమైన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పలు కీలకాంశాలపై చర్చించిన అనంతరం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రతిపక్ష నేతలపై వేధింపు చర్యలను తీవ్రంగా ఖండించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరచడాన్ని నిరసించింది. అదానీ గ్రూపు వ్యవహారంపై తక్షణమే జెపిసిని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.
ప్రతిపక్ష నేతలపై వేధింపులు
ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా వారిని ఎంపీలుగా అనర్హులుగా చేసేందుకు నేరపూరితమైన పరువునష్టం మార్గాన్ని బీజేపీ ఉపయోగించుకోవడాన్ని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీకి శిక్ష పడిన తీరు, ఆ వెను వెంటనే ఆయనను చట్టసభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించేందుకు తొందరపడడం చూస్తుంటే విమర్శలను ఏమాత్రమూ తట్టుకోలేని తీవ్ర అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది బీజేపీ హేయమైన నిరంకుశ ధోరణి, స్వభావాన్ని ప్రతిబింబిస్తోంది.
ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇప్పటికే దారుణంగా దుర్వినియోగం చేస్తున్న క్రమంలో ఈ సంఘటన అన్నింటికంటే ముందుంది. అత్యంత అల్పమైన కారణాలతో రాజకీయ ప్రత్యర్ధులపై అనేక రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీలు కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి. కేసులు పెట్టాయి. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా ఇప్పటికే అరెస్టయి జైల్లో వున్నారు. చాలా ఆలస్యంగానైనా లక్ష్యంగా చేయబడి, వేధింపులకు గురవుతున్న వారిలో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, వారి కుటుంబం (ఆర్జేడీ), కవిత (బీఆర్ఎస్) ఇంకా చాలా మంది వున్నారు.
అదానీని విచారించాలి
2014 నుంచి భారతదేశాన్ని శాసిస్తున్న కార్పొరేట్-మతోన్మాద సంబంధాల్లో అత్యంత హేయమైన తీరును హిండెన్‌బర్గ్ నివేదిక బట్టబయలు చేసింది. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు, ఫోర్బ్స్ అంచనాల ప్రకారం, అదానీ గ్రూపు మార్కెట్ పెట్టుబడుల విలువ 710కోట్ల డాలర్లుగా వున్నాయి. 2022 వచ్చేసరికి, ఒక్కసారిగా ఈ ఆస్తులు 20వేల కోట్ల డాలర్లకు ఎగబాకాయి. 2014లో అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో అదానీ స్థానం 609గా వున్నది, 2022 వచ్చేసరికి నాటకీయంగా ప్రపంచంలోనే రెండో సంపన్నుడిగా మారాడు.
అదానీ గ్రూపు పాల్పడిన దారుణమైన, హేయమైన తప్పుడు చర్యలను, తప్పొప్పులను బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా సమర్ధిస్తోంది. అదానీ గ్రూపునకు, ఆశ్రిత పెట్టుబడిదారులతో వున్న సంబంధాల కారణంగానే, ప్రజలు ఎంతగానో కష్టపడి సంపాదించుకుని, ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి జాతీయ బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు మొత్తాలను వేలాది కోట్ల రూపాయిల మేర దోచుకోవడానికి వీలు కల్పించింది. అదానీ వ్యవహారం బట్టబయలైనప్పటికీ ఆ మొత్తం అధ్యాయంపై ఏ రకమైన విచారణ జరిపించడానికైనా తీవ్రంగా తిరస్కరిస్తోంది.
అదానీ గ్రూపు తప్పుడు చర్యలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌ను పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటిస్తోంది. చట్ట నిబంధనలకు అనుగుణంగా అదానీ గ్రూపుపై చర్యలు తీసుకోవాలి.
పార్లమెంట్‌ను స్తంభింపచేసిన బీజేపీ !
తమ పాలనలో అనూహ్యంగా పెరిగిన వ్యాపారవేత్తలతో సంబంధాలపై వచ్చే ప్రశ్నలను తట్టుకోలేని బీజేపీ, పార్లమెంట్లో దీనిపై చర్చ జరిగేందుకు లేదా జేపీసీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను అంగీకరించేందుకు మొండిగా తిరస్కరిస్తోంది.
భారతదేశ ప్రజాస్వామ్యం స్థితిగతులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను సాకుగా తీసుకుని రోజుల తరబడి పాలక పార్టీ సభ్యులు లోక్‌సభ కార్యకలాపాలను స్తంభింప చేయడం గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగనిది. ఎలాంటి చర్చ జరగకుండానే కేంద్ర బడ్జెట్‌ను గిలెటిన్ చేసేందుకు కూడా ఈ పరిస్థితి దారి తీసింది.
రాజ్యాంగ అధికారాలకు విఘాతం
పార్లమెంట్ కార్యకలా పాలను స్తంభింప చేయడంతో పాటూ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఉప రాష్ట్రపతి వంటి రాజ్యాంగ అధికారులు పదే పదే చేస్తున్న ప్రకటనలతో న్యాయ వ్యవస్థపై దాడులు కొనసాగుతునే వున్నాయి. న్యాయవ్యవస్థపై కార్యనిర్వాహక వర్గం నియంత్రణ వుండేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తప్పనిసరిగా ఓడించాలి.
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ లక్ష్యాలను సాధించే పాత్రను గవర్నర్లు పోషించడం కొనసాగుతోంది.
పదును తేలుతున్న మతోన్మాద ధోరణులు
మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన సభ్యులపై పథకం ప్రకారం దాడులకు పాల్పడుతున్న సంఘటనలు పెరుగుతుండడం పట్ల పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గో సంరక్షకుల పేరుతో ముస్లిం యువతను హతమార్చుతున్న సంఘటనలు కూడా అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. చర్చిలపై , క్రైస్తవులపై ముఖ్యంగా క్రైస్తవ గిరిజనులపై అనేక రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ సంబంధించి వివిధ కొత్త తప్పుడు కథనాలు, చరిత్రలు కల్పించబడు తున్నాయి. ముఖ్యంగా సమీప భవిష్యత్తులో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మతోన్మాద ధోరణులకు మరింత పదును పెట్టేందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నారు.
ఓబీసీ కోటా కింద ముస్లింలకు రిజర్వేషన్లు రద్దుచేయాలని కర్నాటక బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో ఇది చోటు చేసుకుంది. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలపై విస్తృత దాడులు, వేధింపులు ఉధృతమయ్యాయి.
పెరుగుతున్న ఆర్థిక భారాలు
ఎలాంటి చర్చ జరగకుండానే 2023-24 సంవత్సర కేంద్ర బడ్జె ట్ను ఆమోదించడాన్ని పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఆర్థిక మాంద్యం, ఉపాధి ఉత్పత్తి లేదా సామాన్యుల కొనుగోలు శక్తి పెరగడం వంటి సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్ దారు ణంగా విఫలమైంది. దీనికి విరు ద్ధంగా, ఆర్థిక లోటును కుదించేందుకు గానూ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తోంది. మరోపక్క సంపన్నులకు మరింతగా పన్ను రాయితీలు ఇస్తోంది. గత రెండేండ్లలో భారతదేశంలోని ఒక శాతం మంది సంపన్నుల వద్ద 40.5శాతం సంపద పోగు పడిందని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించిన సమయంలో ఇది జరిగింది. ఆ రకంగా, ఈ సంకుచిత బడ్జెట్ ఆర్థిక సంక్షోభాన్ని మరింత ఉధృతం చేస్తుంది.
ప్రజలపై మరిన్ని భారాలు మోపబడుతున్నాయి. అందులో తాజాది ఎల్పీజీ ధరల పెంపు. నిరుద్యోగం, ఆకలి పెరుగుతూనే వున్నాయి. మరోపక్క అసమానతలనేవి అసహ్యకరమైన స్థాయిలకు విస్తరించబడుతున్నాయి.
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను నాశనం చేస్తున్నారు
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ప్రభుత్వం తప్పనిసరి చేసిన జాతీయ మొబైల్ పర్యవేక్షక వ్యవస్థ యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఈ యాప్‌లో సాంకేతిక ఇబ్బందులు వున్న కారణంగా కార్మికులు సగానికి సగం వేతనాలు కోల్పోయినట్లు వార్తలందుతున్నాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కార్మిక శక్తిలో ప్రధానంగా వున్న మహిళా కార్మికులు యాప్‌ను ఉపయోగించాలంటే స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బడ్జెట్లో ఈ పథకానికి నిధులు భారీగా కోత కోయడం, దానికి తోడు వేతనాల చెల్లింపులు సుదీర్ఘ కాలం పెండింగ్‌లో వుంచడంతో పాటూ యాప్‌ను కూడా ప్రవేశపెట్టడంతో ఈ పథకం అసమర్ధంగా తయారైంది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు
మీడియా వ్యవస్థపై పట్టు వున్న మోడీ ప్రభుత్వం ఎన్నికలపరంగా అజేయులమనే ధోరణిని ప్రచారం చేస్తూ వస్తోంది. కానీ ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే ధోరణి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, బీజేపీ గుజరాత్‌ను నిలబెట్టుకోగా, హిమాచల్ ప్రదేశ్‌లో సిట్టింగ్ ప్రభుత్వాన్ని కోల్పోయింది. గత 15ఏండ్లుగా తన నియంత్రణలో వుంటూ వచ్చిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా కోల్పోయింది.
మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తంగా 180సీట్లకు గానూ బీజేపీ కేవలం46సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. త్రిపురలో బీజేపీ ఎంఎల్ఎల సంఖ్య 46 నుంచి 32కి పడిపోయింది. నాగాలాండ్‌లో 12సీట్లు గెలుచుకుని 2వ స్థానంలో నిలిచింది. మేఘాలయలో కేవలం రెండు సీట్లను గెలుచుకుని మిగిలిన 58సీట్లలో డిపాజిట్లను కూడా కోల్పోయింది. పోలైన ఓట్ల దృష్ట్యా చూసినట్లైతే, త్రిపురలో బీజేపీకి 38.97 శాతం ఓట్లు వచ్చాయి. నాగాలాండ్‌లో 18.81శాతం ఓట్లు రాగా, మేఘాలయలో కేవలం 9.33శాతం ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, స్థానిక ప్రాంతీయ పార్టీలతో కలిసి మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వంలో వుంది.
పూనే జిల్లాలోని కాస్బా పేట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానం, గత రెండు దశాబ్దాలుగా నిరంతరంగా బీజేపీ అధీనంలో వున్న సీటును కాంగ్రెస్ అభ్యర్ధి కైవసం చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని సాగర్దిఘి ఉప ఎన్నికల్లో 2011 నుండి తృణమూల్ గెలుస్తూ వచ్చిన సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. 2021లో తృణమూల్ ఈ సీటును బీజేపీపై 50వేల ఓట్ల మెజారిటీతో గెలుచుకుంది. కాంగ్రెస్-వామపక్ష అభ్యర్ధి దాదాపు 23వేల ఓట్ల తేడాతో ఈ సీటును గెలుచుకుని బీజేపీని మూడో స్థానానికి నెట్టివేశారు.
ఉధృతమవుతున్న ప్రజా పోరాటాలు
వివిధ వర్గాల్లో పెరుగుతున్న ప్రజా పోరాటాలను పొలిట్‌బ్యూరో గుర్తించింది.
- మార్చి 20న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) విజయవంతంగా కిసాన్ మహా పంచాయత్‌ను నిర్వహించింది. దీనికి పెద్ద సంఖ్యలో రైతాంగం హాజరైంది. వ్యవసాయంపై పెరుగుతున్న కార్పొరేట్ నియంత్రణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని పిలుపిచ్చింది.
- నాసిక్ నుండి ముంబయికి మహారాష్ట్ర కిసాన్ సభ మార్చి 12న మూడో లాంగ్ మార్చ్‌ను ప్రారంభించింది. ముంబయికి ప్రదర్శన చేరుకోవడానికి ముందుగానే, షిండే-బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని డిమాండ్లను ఆమోదించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉల్లిపాయలకు క్వింటాల్‌కు రూ.350 సబ్సిడీ ఇవ్వడం, 88వేల మందికి పైగా రైతులకు రుణాల రద్దుతో సహా అన్ని డిమాండ్లను అంగీకరించింది.
- అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కార్మికులు సమ్మెలకు దిగుతున్నారు. దీంతో సమైక్యంగా, కృతనిశ్చయంతో కార్మిక సంఘాలు సాగించే కార్యాచరణ ముందు బీజేపీ ప్రభుత్వం తల వంచాల్సిన పరిస్థితి వస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ కార్మికులు, స్కీమ్ కార్మికులు ఇలా అందరూ సమ్మెలకు దిగుతున్నారు.
- ఏప్రిల్ 5వ తేదీన పార్లమెంట్‌కు జరిపే మజ్దూర్-కిసాన్ మార్చ్‌కు పూర్తి సంఘీభావాన్ని, మద్దతును పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటించింది.
కేంద్ర కమిటీ సమావేశం
ఏప్రిల్ 27, 28, 29 తేదీల్లో పార్టీ కేంద్ర కమిటీ సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది.
కేరళ ఎల్డీఎఫ్ను లక్ష్యంగా చేసుకోవడంపై ఖండన
ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని, కేరళ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకోవడాన్ని పొలిట్‌బ్యూరో తీవ్రంగా నిరసించింది. కేరళలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా బీజేపీతో కలిసి ఇదే తరహా చర్యలకు పాల్పడు తోంది. ఇటువంటి ప్రయత్నాలకు కేరళ ప్రజలు దీటైన సమాధానం ఇవ్వాలి.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు
త్రిపుర శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలపై పొలిట్‌బ్యూరో ప్రాధమికంగా విశ్లేషణ జరిపింది. ప్రతిపక్ష పార్టీలు పనిచేయలేని, నిరంతరంగా దాడులకు గురయ్యే ఒక అసాధారణ పరిస్థితిలో ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయని పేర్కొంది. గత ఐదేండ్ల కాలంలో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారని పేర్కొంది. ఆ భయానక పరిస్థితులను, భౌతిక దాడులను తట్టుకుని ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసింది.
ఆశించిన రీతిలో ఓట్లను, సీట్లను గెలుచుకోవడంలో విఫలమవడంతో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ దారుణమైన, భయంకరమైన దాడులకు దిగడం ఆరంభించింది. సీపీఐ(ఎం)ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని సాగుతున్న దాడులను పొలిట్‌బ్యూరో ఖండించింది. భయోత్పాతం, బెదిరింపులు, దోపిడీలు, కార్యాలయాలు, ఇళ్ళకు నిప్పంటించడం, ఆస్తులను ధ్వంసం చేయడం, జీవనోపాధికి ఉపయోగించే సాధనాలైన రిక్షాలు, మూడు చక్రాల బళ్ళు వంటి వాటిని నాశనం చేయడం, పంటలను ముఖ్యంగా రబ్బర్ తోటలను ధ్వంసం చేయడం, చేపల చెరువుల్లో విషం కలపడం వంటివి వెయ్యికి పైగా సంఘటనలు చోటు చేసుకున్నాయి.
సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌లకు చెందిన ఏడుగురు పార్లమెంటరీ సభ్యుల బృందం త్రిపురలో పర్యటించి, పరిస్థితులను సమీక్షించింది. ఆ బృందంపై కూడా పోలీసుల సమక్షంలోనే బీజేపీ-ఆర్ఎస్ఎస్ దుండగులు దాడి జరిపారంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎంత ప్రమాదకరమైన పరిస్థితి నెలకొందో అర్ధమవుతోంది.