Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : పోలవ రం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తు 45.72 మీటర్లని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లని తెలిపారు. పోలవరం డ్యాం ఎఫ్ఆర్ఎల్ తగ్గింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన చేసినట్టు తమకు సమాచారం లేదని తెలిపారు.పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2017-18 సంవత్సరాల లెక్కల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా 2019లో సవరించిన వ్యయ కమిటీ (ఆర్సీసీ) చేసిన సిఫారసును జలశక్తి సలహా కమిటీ ఆమోదించినా ఆ తరువాత వేసిన కమిటీ ఆ మొత్తాన్ని తగ్గిస్తూ సిఫారసు చేశాయని జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో నియమించిన ఆర్సీసీ పోలవరం అంచనా వ్యయాన్ని 2013-14 లెక్కల ప్రకారం రూ.29,027.95 కోట్లుగా, 2017-18 లెక్కల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా సిఫారసు చేసిందని మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు రూ. 13,463.21 కోట్లు చెల్లించినట్టు మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జాప్యం...
రూ.53 వేల కోట్లు అదనపు భారం
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 56 ప్రాజెక్ట్‌లకు సంబంధించి అంచనా వ్యయం 52.36 శాతం,(అదనంగా రూ.53 వేల కోట్లు) పెరిగినట్టు గణాంకాలు, కేంద్ర కార్యక్రమాల అమలు శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ వెల్లడించారు. వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,01,272 కోట్ల వాస్తవ అంచనా విలువతో ప్రారంభించిన 56 ప్రాజెక్ట్ పనుల అంచనా విలువ రూ.1,54,300 కోట్లకు పెరిగినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ 56 ప్రాజెక్ట్‌లలో 24 ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జరిగిన జాప్యం కారణంగా నిర్ణీత గడువులోగా పూర్తి కాలేదు.
పోలవరం అంచనా వ్యయం
రూ.10 వేల కోట్ల నుంచి 55 వేల కోట్లకు
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 10,151 కోట్ల నుంచి 55,548 కోట్ల రూపాయలకు పెరిగినట్లు మంత్రి తన జవాబులో వెల్లడించారు. 2009 ఫిబ్రవరిలో రూ.10,151 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 2014 ధరలకు అనుగుణంగా సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548 కోట్ల వ్యయం చేయాల్సి ఉంది. అంటే 2009లో నిర్ణయించిన అంచనా వ్యయం కంటే మరో 45,397 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నట్లు మంత్రి రావ్ ఇందర్జిత్ పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నంలో హెచ్‌పిసిఎల్ ఆధ్వర్యంలోని విశాఖ రిఫైనరీ అధునీకరణ ప్రాజెక్ట్‌కు రూ.20,928 కోట్ల వ్యయం అవుతుందని 2020 జూలైలో అంచనా వేయగా, 2023 అక్టోబర్‌లో సవరించిన అంచనా వ్యయం రూ.26,264 కోట్లకు చేరింది. అంటే రూ.5,336 కోట్ల అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు.
2027నాటికి కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్
రూ.1,045 కోట్ల వ్యయంతో కోటిపల్లి-నర్సాపూరం రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు 2001లో ఆమోదం లభించినట్లు మంత్రి తెలిపారు. నాటి అంచనాల ప్రకారం 2009 మార్చి నాటికి ఇది పూర్తి కావలసి ఉంది. నిధుల కొరత, అటవీ భూముల సేకరణలో జరిగిన అసాధారణ జాప్యం కారణంగా ఈ ప్రాజెక్ట్ 216 నెలలు ముందుకు కదలలేదు. తాజాగా రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో 2027 మార్చి నాటికి కోటిపల్లి-నర్సపూర్ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోందని మంత్రి వెల్లడించారు.