Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నళిని చిదంబరం పిటిషన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పిటిషన్ ట్యాగ్
- మూడు వారాల తర్వాత సుప్రీం పరిశీలన
న్యూఢిల్లీ: మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపే విషయంలో కేంద్రమాజీ మంత్రి పి.చిదంబరం భార్య నళిని చిదంబరం 2018లో దాఖలు చేసిన పిటిషన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ట్యాగ్ చేసింది. అనంతరం మూడు వారాల పాటు విచారణను వాయిదా వేసింది. ఒక మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తోందంటూ సుప్రీంకోర్టులో కె. కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల ధర్మాసనం విచారించింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మహిళలను ఇంట్లో విచారించాలా? ఆఫీసులో విచారించాలా? అనేదే ప్రశ్నగా కపిల్ సిబల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మధ్యలో జోక్యం చేసుకున్న ధర్మాసనం... ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించిందని పేర్కొంది. ధర్మాసనం వ్యాఖ్యలపై స్పందించిన ఈడీ తరఫు న్యాయవాది రాజు, మద్రాస్ హైకోర్టు అభిప్రాయాన్ని ఈ ధర్మాసనం తీర్పు పక్కన పెట్టేదిగా ఉండకూడదని వాదించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఎ) సెక్షన్ 50 అనేది కేవలం విచారణకు మాత్రమే అనీ, దర్యాప్తు కోసం కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విజరు మదన్ లాల్ చౌదరి కేసుకు ముందు ఈ వ్యవహారం ఉత్పన్నం కాలేదన్నారు. మరోసారి జోక్యం చేసుకున్న జస్టిస్ రస్తోగి, త్రిసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని పరిష్కరిస్తుందా? అని తీసుకో వాలనుకుంటున్నట్టు చెప్పారు.
దీనికి స్పందించిన కపిల్ సిబల్ కాదని సమాధానం ఇచ్చారు. అరెస్ట్‌కు ముందు వరకు ప్రత్యేకమైన పద్దతులు పాటిస్తామన్నారు. ఇదే అంశాన్ని విజరు మదన్ లాల్ కేసు కూడా చెబుతుందన్నారు. విజరు మదన్ లాల్ వ్యవహారంలో ఇంతకు ముందు వచ్చిన తీర్పు మీకు లాభం చేకూర్చదని న్యాయమూర్తి అన్నారు. దీనిపై సిబల్ వాదిస్తూ.. తమకు ఈ తీర్పు లబ్ది చేకూర్చుతుందన్నారు. పీఎంఎల్ఎ వ్యవహారంలో సమన్లు జారీ చేసేందుకు ఎలాంటి ప్రక్రియ లేదని సిబల్ వాదనలు వినిపించారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం సెక్షన్ 50(2) స్పష్టంగా ఉందని వెల్లడించింది. అయితే అది ఎంక్వైరీ కోసం మాత్రమే అని వివరించారు.
కానీ, తమకు దర్యాప్తు కోసం ఈడి నుంచి సమన్లు పొందినట్టు చెప్పారు. పీఎంఎల్ఏ చాప్టర్ 8 లోని సమన్లు ఇచ్చే అధికారం కేవలం సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్స్ సమర్పించేందుకు మాత్రమే ఉన్నదన్నారు. కానీ సమన్లు ఇచ్చేందుకు పీఎంఎల్ఎలో ఎలాంటి పద్దతి లేదన్నారు. ''ఫిర్యాదులో మమ్మల్ని నిందితులుగా పేర్కొన్నారు. అలాగే దర్యాప్తు జరుగుతోంది. నన్ను నిందితులుగానే ప్రస్తావిస్తున్నారు. దర్యాప్తు కోసమే నాకు సమన్లు జారీ చేశారు. అయితే పీఎంఎల్ఎ చట్టంలో ఇలాంటి పద్దతి ఏదీ లేదు'' అని అన్నారు. జస్టిస్ రస్తోగి జోక్యం చేసుకొని ''మేం నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసుతో ఈ పిటిషన్‌ను జతచేసి విచారిస్తాం. ఆ కేసుతో ట్యాగ్ చేసి విచారించడమే సరైంది'' అని అభిప్రాయడ్డారు. జోక్యం చేసుకున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిషేక్ బెనర్జీ వ్యవహారాన్ని దీంతో ముడిపెట్టదనీ, అది వేరే అంశమని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం... నళిని చిదంబరంతో కేసుతో ట్యాగ్ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.