Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ గ్రూపు షేర్లకు ఈపీఎఫ్ఓ రక్ష
- క్లిష్ట సమయంలోనూ పెట్టుబడులు కొనసాగింపుపై అనుమానాలు..
న్యూఢిల్లీ : తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్న అదానీ గ్రూపు కంపెనీలకు ఉద్యోగ, కార్మికుల సొమ్మును పణంగా పెడుతున్నారు. అదాని కంపెనీలు తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత ఆ కంపెనీల షేర్లు తీవ్ర పతనాన్ని చవి చూస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో అదానినీ కాపాడటానికి ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల సొమ్మును వాడుతోంది. దాదాపుగా 27.73 కోట్ల మంది ప్రయివేటు, ప్రభుత్వ రంగ ఉద్యోగ, కార్మికుల సొమ్ము ఇందులో ఉంది. హిండెన్‌బర్గ్ దెబ్బతో అనేక పెద్ద ఇన్వెస్టర్లు అదానీ కంపెనీల్లో పెట్టుబడులకు వెనుకాడుతుండగా.. మరోవైపు ఈపీఎఫ్ఓ మాత్రం అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్)లో పెట్టుబడులను కొనసాగిస్తోందని రిపోర్టులు వస్తోన్నాయి. ఈపీఎఫ్ఓలోని 15 శాతం కార్పస్ ఫండ్స్‌ను స్టాక్ ఎక్సేంజీల్లో పెట్టుబడులుగా పెడుతోంది. 2022 మార్చి నాటికి రూ.1.57 లక్ష కోట్ల నిధులను బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈల్లోని పలు సూచీల్లో ఇన్వెస్ట్ చేసింది. మరో రూ.8,000 కోట్లను 2022-23లో పెట్టుబడులుగా పెట్టింది.
అదానీ గ్రూపు అక్రమాలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 24న రిపోర్టు చేసింది. అప్పటి నుంచి అదానీ కంపెనీల షేర్లు పేక మేడల కూలిపోయి.. ఇప్పటికీ తీవ్ర ఒత్తిడిలోనే ఉన్నాయి. ఎల్ఐసీ తర్వాత అదానీ కంపెనీల్లో అత్యధికంగా ఈపీఎఫ్ఓ ట్రస్టీ పెట్టుబడులే ఉన్నాయి. అదానీ స్టాక్స్ 50 శాతం మేర క్షీణించాయి. ఈ సూచీల్లో పెట్టుబడులపై పెద్ద ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ మదుపర్లు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఈపీఎఫ్ఓ మరిన్ని పెట్టుబడులకు సిద్దం అవుతోందనే రిపోర్టులు ఉద్యోగ, కార్మికుల ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదాని స్టాక్స్‌ల్లో ఈపీఎఫ్ఓ పెట్టుబ డులపై సెంట్రల్ ప్రావిడెండ్ ఫండ్ కమిషనర్ నీలమ్ శామి రావును ది హిందూ పత్రిక మార్చి 23న వివరణ కోరగా ఆయన స్పందించలేదు. అదానీ స్టాక్స్‌ల్లో తక్కువ పెట్టుబడులే ఉన్నప్పటికీ.. ట్రస్టీ రాబడిని దెబ్బతీస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా.. సోమవారం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగే రెండు రోజుల బోర్డు సమావేశంలో ఈ అంశం తెరపైకి రావొచ్చన్నారు. అదానీ షేర్లలో భారీ క్షీణత వల్ల రిటర్న్‌లు తగ్గొచ్చు. దీంతో పీఎఫ్ సభ్యులకు చెల్లించే వార్షిక వడ్డీ రేటులో కోత విధించే అవకాశం ఉంది. మార్చి 24 నుంచి ఇప్పటి వరకు అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 49 శాతం, ఏపీసెజ్ స్టాక్స్ 19 శాతం పతనమయ్యింది. సోమవారం సెషన్లోనూ బీఎస్ఈ లో అదాని ఎంటర్ప్రైజెస్ షేర్ 1 శాతం పతనమై రూ.1,723కు దిగజారింది. ఇంట్రాడేలో 1,682 కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఏపీసెజ్ షేర్ 1.43 శాతం నష్టపోయి 629 వద్ద ముగిసింది.