Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా సంప్రదింపుల దశలోనే సీఎంలు, కేంద్రమంత్రి మధ్య భేటీ
- సుప్రీం కోర్టుకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: పోలవరం ముంపుపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. మూడు నెలల పాటు విచారణను వాయిదా వేయాలని కోరుతూ లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు వరద ముంపు తలెత్తుతున్నందున దానికి పరిష్కార మార్గాలు చూపాలని ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం సుప్రీం కోర్టు విచారణ జాబితాలో ఉన్నాయి. ఈ పిటిషన్లు జస్టిస్ జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ హన్సుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు కేంద్రం లేఖ రాసింది. 2022 సెప్టెంబర్ 6న సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం నివేదికను ఖరారు చేయడానికి కొంత సమయం అవసరమని లేఖలో పేర్కొంది. కేంద్ర జలశక్తి శాఖమంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమావేశం ఇంకా సంప్రదింపుల దశలోనే ఉన్నదని తెలిపింది. పొరుగు రాష్ట్రాల్లో ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలనీ, భాగస్వాములతో సమావేశం నిర్వహించాలనీ, అవసరమైతే ప్రభావిత రాష్ట్రాల సీఎంలు కూర్చొని మిగిలిపోయిన సమస్యలు పరిష్కరించుకోవాలని గతేడాది సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తుది నివేదిక అందించడానికి మూడు నెలల సమయం కావాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానానికి కేంద్రం లేఖ సమర్పించింది. అందుకే ఈ కేసును మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరింది. న్యాయమూర్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, ఈ వాయిదా లేఖను అందజేయాలని లేఖలో పేర్కొంది.