Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డీరూపంలో 9.4 లక్షల కోట్లు: కేంద్రం
భారత్ వెలిగిపోతోందంటూ మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్లను వదిలేసి,పేదజనంపై ఎడాపెడా పన్నులు భారాలు మోపుతున్నా ఖజానా నిండటంలేదు.ఇంకా జనాన్ని ఎలా పీల్చిపిప్పి చేయాలనే ఆలోచన చేస్తున్నది.మరోవైపు ఆవురావురామంటూ ఎక్కడ బడితే అక్కడ అప్పులను తీసుకుంటోంది. ఆర్బీఐ మొదలుకుని ప్రపంచ బ్యాంకు వరకూ.. ఇలా అప్పు దొరికిన చోటల్లా ఎగబడుతోందని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.155.8 లక్షల కోట్లకు చేరిందని, దీనికి వడ్డీనే రూ.9.4 లక్షల కోట్లు అవుతుందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022-23 సవరించిన బడ్జెట్ అంచనాల్లో కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.155.8 లక్షల కోట్లు కాగా, అందులో రూ.148.8 లక్షల కోట్లు దేశీయ అప్పు, రూ.7 లక్షల కోట్లు విదేశీ అప్పు అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అప్పు కూడా ఏడాదికి ఏడాది భారీగా పెరుగుతోంది. 2017-18లో కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.82.9 లక్షల కోట్లు కాగా, 2018-19లో రూ.92.5 లక్షల కోట్లకు, 2019-20లో రూ.105.2 కోట్లకు, 2020-21లో రూ.122.1 లక్షల కోట్లకు, 2021-22లో రూ.138.9 కోట్లకు, 2022-23లో అది కాస్తా రూ.155.8 లక్షల కోట్లకు పెరిగింది. దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో అప్పుల వాటా 2017-18లో 48.5 శాతం, 2018-19లో 49 శాతం, 2019-20లో 52.4 శాతం, 2020-21లో 58.7 శాతం, 2022-23 (సవరించిన బడ్జెట్ అంచనా)లో 57.3 శాతం ఉంది. దీన్ని బట్టీ చూస్తే జీడీపీలో అప్పుల వాటా కూడా ఏడాదికి ఏడాది పెరుగుతోంది.
రూ. 82కి పడిపోయిన రూపాయి విలువ
అమెరికా డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ రూపాయి విలువ రూ.82కి పడిపోయిందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలి పారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రూ. 82.4845కి రూపాయి విలువ పతనం అయిందని తెలిపారు.
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల స్పష్టమైంది. 2022-23 (ఏప్రిల్- ఫిబ్రవరి) మధ్య 6.75 శాతం వినియోగదారు ధరల సూచిక-కంబైన్డ్ (సీపీఐ-సీ) ద్రవ్యోల్బణం ఉన్నదని కేంద్ర మంత్రి తెలిపారు. 2021-22లో సీపీఐ-సీ ద్రవ్యోల్బణం 5.51 శాతం ఉందని పేర్కొన్నారు.
ఐదేండ్లలో కార్పొరేట్లకు రూ.8.72 లక్షల కోట్లు మాఫీ
- కేంద్ర మంత్రి భగవంత్ ఖరాడ్
గత ఐదేండ్లలో దేశంలోని కార్పొరేట్లు తీసుకున్న రుణాలు రూ.8,72,778 కోట్లు మాఫీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖరాడ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2017-18 నుంచి 2021-22 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 6,31,693 కోట్లు, ప్రయివేట్ రంగ బ్యాంకులు రూ.2,24,855 కోట్లు, విదేశీ బ్యాంకులు రూ.16,230 కోట్లు మాఫీ చేశాయని తెలిపారు