Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో రోజుకు ముగ్గురు అన్నదాతల ఆత్మహత్య
- దేశవ్యాప్తంగా 22 శాతం బలవన్మరణాలు ఇక్కడే..!
- కేంద్ర ప్రభుత్వ సమాచారంలో వెల్లడి
- రాష్ట్రంలో బీజేపీ పాలనపై రైతన్నల ఆగ్రహం
బెంగళూరు : కర్నాటకలో బీజేపీ పాలనలో రైతులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాతలకు సరైన సహకారం అందటం లేదు. దీంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన మ్యానిఫెస్టోలో రైతులకు అయ్యే ఖర్చుకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)గా హామీ ఇచ్చింది. నిజానికి, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపవుతుందని ప్రధాని కూడా తెలిపిన విషయం విదితమే.
కర్నాటకలో మొత్తం రైతుల పరిస్థితి ఏమిటి?
బీజేపీ తన రిపోర్ట్ కార్డును ప్రదర్శించడానికి బదులు వివిధ పథకాల లెక్కలను తెలుపుతున్నది. కిసాన్ సమ్మాన్ నిధి సమాచారాన్ని ప్రచారం చేసుకుంటున్నది. అయితే రైతుల పరిస్థితి ఏమిటన్న దానిపై మాత్రం ఏమీ చెప్పడం లేదు. కర్నాటకలో రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలంటే కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల గణాంకాలను చూస్తే పరిస్థితి తేటతెల్లమవుతుంది. రైతుల ఆత్మహత్యలపై రాజ్యసభలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. రైతుల ఆత్మహత్యల్లో కర్నాటక దేశంలోనే రెండో స్థానంలో ఉంది. 2021లో ఇక్కడ 1,170 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే రోజుకు ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా రన్న మాట. 2017లో ఈ సంఖ్య 1,157గా ఉంది. 2018 1365 మంది, 2019లో 1,331 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా మహమ్మారి కాలమైన 2020లో 1072 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇది మళ్లీ 2021లో 1170కి పెరిగడం గమనార్హం. రైతుల ఆత్మహత్యల్లో తగ్గుదల లేకపోగా.. పెరిగినట్టు లెక్కలు స్పష్టం చేస్తు న్నాయి. దేశంలో మొత్తం రైతుల ఆత్మహత్యల్లో 22% ఒక్క కర్నాటక నుంచే కావడం గమనార్హం. అంటే దేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రతి నాలుగో రైతు కర్నాటకవారేని విశ్లేషకులు వివరించారు.
కర్నాటక రైతుల ఆదాయ స్థితి
కర్నాటకలో రైతుల నెలవారీ సగటు ఆదాయం రూ. 13,441గా ఉన్నది. ఇది మొత్తం రైతు కుటుంబం యొక్క ఆదాయం కావడం గమనార్హం. ఎందుకంటే సాధారణంగా పొలంలో జంతువులతో సహా కుటుంబం మొత్తం ఏదో ఒక రూపంలో పని చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం రైతు కుటుంబానికి రోజువారి ఆదాయం రూ.454 మాత్రమే. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో నైపుణ్యం లేని నిర్మాణ కార్మికుడికి కనీస వేతనం రూ. 595గా ఉండటం గమనార్హం.అంటే, కర్నాటకలోని రైతు కుటుంబం భవన నిర్మాణ కార్మికుడికి నిర్దేశించినంత కూడా రోజుకు సంపాదించడం లేదు. నైపుణ్యం లేని భవన నిర్మాణ కార్మికుడి కంటే కర్నాటకలో రైతు కుటుంబ ఆదాయం తక్కువగా ఉందని స్పష్టమవుతున్నదని విశ్లేషకులు తెలిపారు. రైతుల జీవితాలను బాగు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. దీంతో పాటు కర్నాటకలో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలనూ ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, బీజేపీ చేసుకుంటున్న ప్రచారాలు.. కర్నాటకలోని క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని రైతులు తెలిపారు. ఎన్నికల హామీలను విస్మరించి రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతున్న బీజేపీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెబుతామని హెచ్చరించారు.