Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నకిలీ, కల్తీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. నాణ్యతలేని మందుల తయారీకి వ్యతిరేకంగా ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణా సంస్థలు సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన మొదటి దశ డ్రైవ్‌లో భాగంగా 76 ఫార్మా సంస్థల్లో తనిఖీలు నిర్వహించాయి. నకిలీ, కల్తీ మందులు తయారు చేస్తున్న 18 సంస్థలు అనుమతులు రద్దు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. దేశవ్యాప్తంగా గత 15 రోజుల్లో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ, కల్తీ మందులు తయారు చేస్తున్న 18 సంస్థల అనుమతులు రద్దు చేశామని, మరో 26 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ డ్రైవ్‌లో మొత్తంగా 203 ఫార్మా సంస్థలను గుర్తించినట్లు చెప్పారు. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్‌లో 70 సంస్థలు ఉన్నాయని, తరువాత ఉత్తరాఖండ్‌లో 45, మధ్యప్రదేశ్‌లో 23 సంస్థలు ఉన్నట్లు చెప్పారు. ఇటీవల భారత ఫార్మా సంస్థలు తయారు చేస్తున్న ఔషధాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఏడాదిలో భారత్‌లో ఉత్పత్తి అయిన దగ్గు మందులతో ఆఫ్రికా దేశాల్లో కొంత మంది చిన్నారులు మృతి చెందగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులోని గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ ఉత్పత్తి చేసిన కంటి చుక్కల మందు అమెరికాలో కొంత మంది చూపు కోల్పోవడానికి కారణమయింది.