Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం రాత్రి 10:45 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ ఏకాంత భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అకాల వరదల కారణంగా పోలవరం డయాఫ్రంవాల్ దెబ్బతిందని, డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2,020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డిడిఆర్ఎంపి అంచనా వేసిందని, ఈ డబ్బును వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి ఖర్చు చేసిన రూ.2,600.74 కోట్లు రెండేళ్లగా పెండింగ్లో ఉన్నాయని, వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ.55,548 కోట్లుగా నిర్థారించిందని, ఈ మొత్తానికి వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి సరఫరా అంశాన్ని కూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వారీ నిబంధనలను సడలించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని, ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అదిస్తే జాప్యాన్ని నివారించవచ్చని కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల పెండింగ్లో ఉన్నాయని, ఈ నిధులను వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారని, ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపి జెన్కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పిఎంజికెఎవై కార్యక్రమం కిందకు రాని రూ.56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇవ్వడంవల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోందని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని కోరారు.