Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 శాతం పెరగనున్న మందుల ధరలు
- ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ : కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రజలపై ధరల భారం మోపేందుకు మోడీ సర్కారు సిద్ధమవుతున్నది. నిత్యవసర మందులపై ధరలను 12 శాతం పెంచేందుకు తయారైంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ఇదే అత్యధిక వార్షిక ధరల పెరుగుదలగా విశ్లేషకులు తెలిపారు. నిత్యవసర మెడిసిన్లుగా ప్రభుత్వం గుర్తించిన 1000కి పైగా ఫార్ములేషన్లు, 384 మందుల ధరలు ఈ మేరకు పెరగనున్నాయి. ఇందు లో గుండె జబ్బులు, బీపీ, చర్మ వ్యాధులు, జ్వరం, ఇన్ఫెక్షన్లు, అనీమియా తదితర చికిత్సల్లో వినియో గించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్ వంటివి ఉన్నాయి.
టోకు ధర సూచిక (డబ్ల్యూపీఐ) గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది వరకు 12.12 శాతంగా ఉన్నదని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారులు తెలిపారు.
డబ్ల్యూపీఐపై ఆధారపడే మందుల ధరలు ఉంటాయని తెలిపారు. అయితే, ఈ సంఖ్యపై అధికారికంగా తెలియాల్సి ఉన్నది. మందుల ధరల పెరుగుదలపై ఎప్పుడైనా సమాచారం వెలువడే అవకాశం కనిపిస్తున్నది. మందుల ధరలు 10శాతానికి పైగా పెరగడం ఇది వరుసగా రెండో ఏడాది కావడం గమనార్హం. గతేడాది ఈ పెరుగుదల 11 శాతంగా ఉన్నది.
ఈ పెరుగుదల ప్రభావం పేద, సామాన్య జనంపై తీవ్రంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆరోగ్య రంగం ఆశించినంత మెరుగ్గా లేదనీ, ఇప్పుడు ఇలా ధరలు పెంచడం సరికాదని అన్నారు. పేద, సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ధరలను నియంత్రించాలని సామాజిక కార్యకర్తలు, ఆరోగ్య నిపుణులు తెలిపారు.