Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 10న పోలింగ్.. 13న ఓట్ల లెక్కింపు
- షెడ్యూల్‌ను విడుదల చేసిన ఈసీఐ
న్యూఢిల్లీ : కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 10న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్నది. మే 13న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 80 ఏండ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు మొట్టమొదటిసారి ఇంటి నుంచే ఓటు వేసేలా (ఓట్ ఫ్రం హౌం) వెసులుబాటు కల్పించనున్నట్టు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 1,200 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు రాజీవ్ కుమార్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 29,141 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు.
ఎస్సీలకు 36.. ఎస్టీలకు 15 స్థానాలు రిజర్వ్
కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 36 ఎస్సీ, 15 ఎస్టీ, 173 జనరల్ కేటగిరి స్థానాలు ఉన్నాయి. కర్నాటక అసెంబ్లీ పదవీ కాలం మే 24తో ముగియనున్నది. దీంతో అక్కడ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 13న ఇవ్వనున్నది. ఏప్రిల్ 20 నామినేషన్ల దాఖలుకు తుది గడువు. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 24తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనున్నది. మే 10న ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికానున్నాయి.
5.24 కోట్ల మందికి పైగా ఓటర్లు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓటర్లు 5,24,11,557 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,23,63,948 మంది జనరల్ ఓటర్లు కాగా, 47,609 మంది సర్వీస్ ఓటర్లు (ఉద్యోగులు) ఉన్నారు. అందులో పురుషులు 2,62,42,561 మంది, మహిళలు 2,59,26,319 మంది, థర్డ్ జండర్ 4,751 మంది ఉన్నారు. యువ ఓటర్లు 9,58,806 మంది, 12,15,142 మంది 80 ఏండ్లు దాటిన వద్ధులు, 5,60,908 దివ్యాంగులైన ఓటర్లున్నారు. మొత్తం 58,282 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో పట్టణాల్లో 24,063, గ్రామీణ ప్రాంతాల్లో 34,219 ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.