Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు ప్రయోజనం చేకూర్చని పీఎం ఫసల్ బీమా యోజన
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అసలు లక్ష్యం నీరు కారుతున్నదా? రైతులకు ఇది ప్రయోజనాన్ని చేకూర్చడం లేదా? ఇన్సూరెన్స్ కంపెనీలకే ఈ పథకం కింద లబ్ది చేకూరుతున్నదా? బీమా కంపెనీలు రైతుల పేరు మీద భారీ మొత్తంలో డబ్బును పోగు చేసుకుంటున్నాయా? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. రైతులకు బీమా విషయంలో పార్లమెంటు సాక్షిగా మోడీ సర్కారు వెల్లడించిన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
- అన్నదాతల పేరు మీద కంపెనీలకు ఆదాయం
- ఆరేండ్లలో రూ. 40వేల కోట్లకు పైగా మిగులు
- అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో అన్నదాత ఆగమాగం
- రైతు సంఘాల నాయకుల ఆగ్రహం
న్యూఢిల్లీ : రైతన్నలకు ఈ ఏడాది వాతావరణం గట్టి పరీక్ష పెడుతున్నది. నిరంతరాయంగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల కారణంగా దేశవ్యాప్తంగా చాలా చోట్ల పంటలు నాశనమయ్యాయి. ఇందులో గోధుమ, ఆవాలు, ఆలు, ఉల్లి, మిరప వంటి పంటలు ఉన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారు ఇప్పుడు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఆపదల నుంచి రైతులను రక్షించడానికి, వారికి ఉపశమనం కలిగించడానికే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఉన్నది. అయితే ఈ పథకం రైతులకు లబ్ది చేకూర్చడమేమో కానీ.. బీమా కంపెనీల బొజ్జనింపుతున్నదని ధనికంగా మారుస్తున్నదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
హర్యానాలోని రోV్ాతక్ జిల్లాలోని రిథాలా గ్రామానికి చెందిన రైతు సంజరు (38) మాట్లాడుతూ.. ''అకాల వర్షాలు, బలమైన గాలులు నా మొత్తం పంటను నాశనం చేశాయి. ఖర్చులో 25 శాతం తిరిగి పొందడం కూడా నాకు కష్టంగా ఉంటుంది'' అని అన్నారు. మొత్తం హర్యానాలో గోధుమ పంటలు, ముఖ్యంగా రోV్ాతక్, భివానీ, హిసార్ , సిర్సాలలో వాతావరణ తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. కొందరు రైతులు ఆవాలు సాగు చేశామనీ, అయితే వడగళ్ల వానతో పంట పొలాల్లోనే పడిపోయిందని తెలిపారు. కాంట్రాక్టుపై ఇతరుల భూమిలో వ్యవసాయం చేసుకునే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కౌలు రైతు రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.1,10,000 పరిమితితో కిసాన్ క్రెడిట్ కార్డును మంజూరు చేసినట్టు చెప్పారు. అంటే పంటల సాగు కోసం బ్యాంకు నుంచి పైన పేర్కొన్న మొత్తం రుణంగా తీసుకోవచ్చు. కానీ చాలా రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా రుణాలు అందడం లేదని సదరు రైతు ఆరోపించారు. ''పంట నాశనమైందా లేదా అన్నది భూస్వామికి పట్టింపు ఉండదు. అతను తన డబ్బును కావాలనుకుంటాడు. అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. గతేడాదీ పంట బాగా లేదు. కానీ నేను డబ్బు ఇచ్చాను. కానీ ఇప్పుడు కూడా నేను అతనికి డబ్బు ఇవ్వాలి. అలాగే కొత్త పంట కోసం డబ్బు కావాలి'' అని అన్నాడు. హర్యానాలో రైతు నాయకుడు, ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షుడు అయిన ఇంద్రజిత్ మాట్లాడుతూ.. పంటల బీమా పథకం అయిన పీఎంఎఫ్బీ రైతుకు అనుకూలమైనది కాదన్నారు. ప్రత్యేకించి కౌలు వ్యవసాయం చేసే వారు, వ్యవసాయ కూలీలు ప్రభుత్వ పరిహారం పొందలేరని చెప్పారు. ముందుగా ప్రభుత్వం పంట నష్టానికి సరైన పరిహారం ఇవ్వదనీ, ఒకవేళ ఏదైనా ఇచ్చినా అది భూస్వాములకు మాత్రమేనని అన్నారు. అయితే కౌలు రైతులకు ప్రభుత్వం మినహాయింపునివ్వాలని ఆయన తెలిపారు. పంటల బీమా పథకం ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉన్నదనీ, దాని ప్రయోజనాలను రైతులు పొందడం దాదాపు అసాధ్యమని అన్నారు. ''బీమా కంపెనీలు కొంతమంది రైతులకు కేవలం ప్రచారం కోసం కొన్ని క్లెయిమ్‌లను ఇస్తాయి. అయితే పెద్ద సంఖ్యలో రైతులకు ఇది దక్కదు'' అని ఇంద్రజిత్ అన్నారు.
హర్యానాతో పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆలు, గోధుమ పంటలు నాశనమయ్యాయనీ, అక్కడ రైతుల పరిస్థితి కూడా అలాగే ఉన్నదని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో కూడా రైతులు పంటలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. పలు రాష్ట్రాల్లోనూ ఇదే తీరు ఉన్నదని తెలిపారు. ఈ అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. రైతుల పేరు మీద ఈ పథకం కింద బీమా కంపెనీలు ప్రయోజనాన్ని పొందుతున్నాయని రైతు నాయకులు ఆరోపించారు. ఈ పథకం రైతులకు తక్కువ, బీమా కంపెనీలకు ఎక్కువ సాయం చేస్తున్నదన్నారు. గత ఏడాది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటులో ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయం స్పష్టమవుతున్నది. కేంద్ర మంత్రి సమా చారం ప్రకారం.. బీమా కంపెనీలు 2016-2017 నుంచి 2021-2022 వరకు రూ.40,000 కోట్లకు పైగా మిగులు (ఆదా)ను చూశాయి. డిపాజిట్ చేసిన ప్రీమియం రూ.1,59,132 కోట్లు కాగా.. కంపెనీలు రూ.11,90,314 కోట్ల విలువైన క్లెయిమ్‌లు చెల్లించాయి.ఈ సమస్యపై రైతులు అనేక సంద ర్భాల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ పథకంలో రైతుల సమస్యను ఎత్తిచూపుతూ ఇటీవల మహారాష్ట్రలో కిసాన్ లాంగ్ మార్చ్ ఉద్యమం జరిగిన విషయం విదితమే. ఈ బీమా కంపెనీలు నష్టాన్ని ఎలా లెక్కిస్తాయో తెలియడం లేదనీ, ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండాలని రైతులు కోరుతున్నారు. పీఎం ఫసల్ బీమా యోజనపై ప్రచారాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను కేంద్రం తెలుసుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు తెలిపారు.