Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై ఒత్తిడి తెస్తాం...
- మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
- బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : దేశ జనాభాలో సగ భాగమున్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందనీ, బీసీల ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. గురువారం సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో సీతారాం ఏచూరిని, సీపీఐ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజాను, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత సహాయ మంత్రి రాందాస్ అథవాలేను ఆయన నివాసంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ బీసీ జనగణన, మండల్ కమిషన్ సిఫారసుల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ(ఎం) ఒత్తిడి పెంచుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై బీసీలు చేసే ఉద్యమానికి మా పార్టీ మద్దతుగా ఉంటుందని తెలిపారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇకనైనా బీసీల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ పెంచాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమానికి తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ జనగణనలో బీసీలవైపే ఉంటామని కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. బీసీ జనగణన విషయంలో కేంద్రంతో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచాలని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు తాటికొండ విక్రం, యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యాం కుర్మా, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.