Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండోర్ ఆలయంలో బావి పైకప్పు కూలి 14మంది మృతి
- మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు
ఇండోర్ : శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం విషాదం చోటు చేసుకుంది. బేలేశ్వర్ మహదేవ్ ఝులేలాల్ ఆలయంలో పురాతనమైన మెట్ల బావి పై కప్పు కూలి 14మంది చనిపోగా, బావిలో పడిన మరో 19మందిని కాపాడారు. లోపల 25మంది వరకు చిక్కుకుని వుంటారని భయపడుతున్నారు. వారికోసం గాలింపు కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులు బావి పైకప్పుపై కూర్చున్నారు. బరువు ఎక్కువ కావడంతో పై కప్పు కూలిపోయి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. కుప్పకూలిన మెట్లబావిలో పడిపోయిన వారిని కాపాడేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నించడం మీడియా విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 10మంది మహిళలు వున్నారని రాష్ట్ర హౌంమంత్రి నరోత్తమ్ మిశ్రా భోపాల్‌లో విలేకర్లకు తెలిపారు. అయితే ఆచూకీ తెలియకుండా పోయిన వారిలో కొంతమంది పిల్లలు కూడా వున్నట్లు భయపడుతున్నారు. బావిలోని నీటినంతా బయటకు తోడించి గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తొలుత మృతుల సంఖ్య 12గా ఇండోర్ కలెక్టర్ ఇళయరాజా ప్రకటించారు. అయితే గాయపడినవారిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా, వారిలో ఒకరు చనిపోయారని తెలిపారు. కాగా ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మృతి చెందినవారి కుటుంబాలకు రూ5లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు నష్టపరిహారాన్ని అందచేయనున్నట్లు ప్రకటించారు. ఇండోర్ కలెక్టర్‌తో, పోలీసు కమిషనర్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి సహాయక చర్యలను వేగవంతంచేయాల్సిందిగా ఆదేశించారు. కాగా ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
హవన్ కార్యక్రమం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారని, వారిలో చాలామంది స్థలాభావం కారణంగా బావి పై కప్పుపై కూర్చున్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తమ వారెవరైనా వున్నారేమోనని భయంతో ప్రజలు ఆలయ ఆవరణలో గుమిగూడిపోయారని చెప్పారు. ప్రమాదం గురించి అధికారులు అప్రమత్తం చేసినా గంట వరకు ఒక్క అంబులెన్సు కూడా రాలేదని పటేల్ నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాంతిభారు పటేల్ విమర్శించారు.