Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వు ఫారెస్టుల్లో కమర్షియల్ మైనింగ్
దేశంలోని మోడీ సర్కారు ప్రకృతి వనరులను ప్రయివేటు మైనింగ్ కంపెనీలకు కట్టబెడుతున్నది. సదరు కంపెనీల ప్రయోజనాలే ధ్యేయంగా పని చేస్తున్నది. ఇందుకు పర్యావరణ పరిస్థితులను సైతం లెక్క చేయడం లేదు. ముఖ్యంగా, అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే పలు తెగల ప్రజలు, రిజర్వ్ ఫారెస్టుల్లో ఉండే జంతువుల మనుగడను కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. తాజాగా రిజర్వు ఫారెస్టుల్లోని క్యాప్టివ్ బ్లాక్‌ల నుంచి కమర్షియల్ మైనింగ్‌కు మోడీ ప్రభుత్వం అనుమతించింది. ఈ ఏకపక్ష నిర్ణయం అక్కడుండే ఆదివాసీలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
- క్యాప్టివ్ బ్లాక్‌ల నుంచి తవ్వకాలకు కేంద్రం ఓకే
- గతనెల 17నే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్
- 2021లోనే సంబంధిత చట్టాన్ని సవరించిన మోడీ సర్కారు
- తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ క్లియరెన్సులు
- ఇది ఆదివాసీల హక్కులను హరించడమే : పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తల ఆగ్రహం
న్యూఢిల్లీ : కమర్షియల్ మైనింగ్‌కు సంబంధించి గతనెల (మార్చి) 17నే కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్‌ను సైతం జారీ చేసింది. పరిమితులకు లోబడి ఒక ఏడాదిలో వెలికితీసిన మొత్తం మినరల్స్‌లో 50 శాతం వరకు అమ్ముకునేలా రిజర్వు ఫారెస్టుల్లోని మైన్లకు చెందిన లీజుదారులకు అనుమతులు ఇవ్వాలనీ రాష్ట్రాలోను అందులో ఆదేశించింది. ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) సిఫారసులపై ఆధారపడి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు (ఎంఓఈఎఫ్ఏసీసీ) ఈ సర్క్యులర్‌ను జారీ చేసింది. రిజర్వ్ ఫారెస్టులోని క్యాప్టివ్ బ్లాక్‌ల మైనింగ్ నుంచి సేకరించిన ఖనిజాల వాణిజ్య విక్రయంపై గతంలో ఉన్న పరిమితులను అందులో సడలించింది.
గతంలోనే చట్ట సవరణ
ఈ సర్క్యులర్‌కు ముందే మోడీ ప్రభుత్వం మైనింగ్ కంపెనీలకు అనుకూలంగా క్షేత్రస్థాయిలో అంతా సిద్ధం చేసి ఉంచింది. తవ్వకాలు మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణలు) నిబంధనలు, 1957 చట్టాన్ని 2021 మార్చిలో మోడీ ప్రభుత్వం ఇప్పటికే సవరించింది. దీంతో సర్క్యులర్‌లో పేర్కొన్నట్టుగా రిజర్వ్ ఫారెస్టుల్లోని క్యాప్టివ్ బ్లాక్‌ల నుంచి తవ్వకాలు జరిపి వెలికితీసిన ఖనిజాల వాణిజ్య విక్రయానికి ఇది మార్గం సుగమం చేసింది. అయితే, రిజర్వు ఫారెస్టుల్లో క్యాప్టివ్ బ్లాక్‌ల నుంచి కమర్షియల్ మైనింగ్‌కు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ సైతం క్లియరెన్సులు ఇవ్వడంతో దీనికి సంబంధించిన పూర్తి తంతు ముగిసినట్టయ్యింది.
మైనింగ్ కంపెనీల ప్రయోజనాలే ముఖ్యం
కేంద్రం నిర్ణయంపై ఇటు పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు, జంతుప్రేమికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
మైనింగ్ కంపెనీ యజమానుల లాభాలే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం వారికి అనుకూలంగా పని చేస్తున్నదనీ, ప్రజాప్రయోజనాలు, పర్యావరణ నష్టాన్ని మాత్రం గాలికొదిలేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల్లో కమర్షియల్ మైనింగ్‌కు గేట్లు ఎత్తడం ద్వారా మోడీ సర్కారు అక్కడి జీవావరణాన్ని, వన్య ప్రాణులను ప్రమాదంలోకి నెట్టేస్తున్నదని పర్యావరణవేత్తలు హెచ్చరించారు.
ఈ మైనింగ్‌తో అధిక మొత్తంలో ఖనిజ దోపిడీ జరుగుతుందని లాభాపేక్షలేని పర్యావరణ సంస్థ కన్జర్వేషన్ యాక్షన్ ట్రస్టుకు చెందిన దెబీ గోయెంకా ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలు ఆర్థిక లాభాలే ధ్యేయం పని చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తూట్లు పొడుస్తాయన్నారు.
అటవీ హక్కు చట్టం ఉల్లంఘన
ప్రకృతి వనరులు ప్రయివేటు కంపెనీలు, ప్రభుత్వానికి చెందవనీ, అవి దేశ ప్రజలకు చెందుతాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టం చేసిందనీ మైనింగ్ ద్వారా ప్రభావితమయ్యే తెగల కూటమి చైర్పర్సన్ రెబ్బాప్రగడ రవి అన్నారు. క్యాప్టివ్ మైన్ల నుంచి తవ్వకాలకు పబ్లిక్, ప్రయివేటు రంగ సంస్థలకు ఏకపక్షంగా అనుమతులిస్తున్నదనీ, కేంద్రం ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తున్నదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నదని రవి ఆందోళన వెలిబుచ్చారు. భారత రాజ్యాంగం ఆదివాసీ తెగలకు కల్పించిన హక్కులను ఇది ఉల్లంఘిస్తుందని నిపుణులు అన్నారు. క్యాప్టివ్ మైన్ల నుంచి వెలికి తీసిన ఖనిజాల వాణిజ్య అమ్మకం, తవ్వకాలకు సంబంధించి అక్కడి స్థానిక తెగల నుంచి అనుమతి తప్పనిసరనీ, అలా చేయకపోవడం పీసా చట్టం, 1995, అటవీ హక్కుల చట్టం, 2006ను ఉల్లంఘించడమేనని రవి తెలిపారు.