Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల ఆరోపణలు
- అణచివేయడానికి కేంద్రం ప్రయ్నతం
- చర్యలు తీసుకుంటామని స్టాలిన్ హామీ
చెన్నై : కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కళాక్షేత్ర ఫౌండేషన్‌లో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు తమిళనాడులో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలను అణిచివేయడానికి కేంద్ర ప్రయత్నిస్తుందని విమర్శలు వస్తున్నాయి. దీంతో కళాక్షేత్రలో లైంగిక వేధింపుల అంశంపై తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం దద్దరిల్లింది. ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ హామీ ఇచ్చారు. 'ఈ ఆరోపణలపై మా ప్రభుత్వం దర్యాప్తు నిర్వహిస్తుంది. ఆరోపణలు నిజమని రుజువు అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర పోలీసు, రెవెన్యూ శాఖకు చెందిన అధికారుల కలయికతో ఏర్పాటు చేసిన బృందం ఇప్పటికే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించిందని చెప్పారు. కళాక్షేత్రం క్యాంపస్ సందర్శించి, విద్యార్థులు, యాజమాన్యంతో చర్చలు జరిపిందని కూడా తెలిపారు. మహిళా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని పోలీసు భద్రతా బృందం కళాక్షేత్రంలో మోహరించిందని కూడా వెల్లడించారు.
కేంద్రం ఆధ్వర్యంలో నడిచే కళాక్షేత్రంలో లైంగిక వేధింపుల ఆరోపణలను అణిచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఆరోపించారు. మార్చి 29న కేళాక్షేత్రం క్యాంపస్‌లో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ పర్యటనను, ఇక్కడ లైంగిక వేధింపులు జరగలేదని, ఎలాంటి పోలీసు ఫిర్యాదులు లేవని కమిషన్ ప్రకటననను విసికె పార్టీ ఎమ్మెల్యే ఎస్ఎస్ బాలాజీ (తిరుపూరుర్ నియోజకవర్గం) ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులు సహాయం లేకుండానే క్యాంపస్‌లో రేఖాశర్మ పర్యటించడం అనుమానం కలిగిస్తుందని చెప్పారు. ఒకవైపు లైంగిక వేధింపులు జరుగుతున్నాయని విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే వేధింపులు లేవని రేఖాశర్మ ఎలా చెబుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కె సెల్వపెరునాథ్గై (శ్రీపెరంబదూర్) ప్రశ్నించారు. ఆరోపణలు చేయకుండా విద్యార్థులను బెదిరిస్తున్నారని, కళాక్షేత్రం, హస్టల్‌ను మూసివేస్తామని కూడా భయపెడుతున్నారని సిపిఐ ఎమ్మెల్యే టి రామంద్రన్ (తళై) ఆరోపించారు.
విద్యార్థుల నిరవధిక సమ్మె ప్రారంభం
కళాక్షేత్ర ఫౌండేషన్‌లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నలుగురు సిబ్బందిని విధుల నుంచి తొలగించాలనే డిమాండ్‌లో సుమారు 250 మంది విద్యార్థులు గురువారం ఉదయం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ శాస్త్రీయ కళల శిక్షణలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఈ సంస్థలో కొన్ని ఏళ్ల నుంచి లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. సంస్థ డైరెక్టర్, ఇతర అధికారులతో తమ సమస్య గురించి చెప్పుకుంటే తమనే టిసి తీసుకుని వెళ్లిపోమ్మని చెబుతారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ (నృత్యం), మరో ముగ్గురు రిపర్టరీ ఆర్టిస్టులు అనేక మంది విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వీరిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే క్యాంపస్, హస్టల్లో బాడీ షేమింగ్, మాటల వేధింపులు ఆపాలని, కౌన్సలర్‌ను కూడా మార్చాలనేవి తమ ఇతర డిమాండ్లగా విద్యార్థులు చెప్పారు. విద్యార్థుల నిరసనతో కళాక్షేత్ర కాలేజ్‌ను శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హస్టల్ యథావిధిగా ఉంటుందని తెలిపారు.