Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొడగింపుపై కేంద్రం నుంచి రాని ప్రకటన
- అనుకూలమైన చెల్లింపు విధానాన్ని పునరుద్ధరించాలి : ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్
న్యూఢిల్లీ : 'ఉపాధి హామీ' పథకం కింద ఆధార్ ఆధారిత చెల్లింపుల కోసం లబ్దిదారుల పేరు నమోదుకు తుది గడువు శుక్రవారం (మార్చి 31)తో ముగిసింది. అయితే, గడువు పొడిగింపుపై మాత్రం కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడకపోవడం గమనార్హం.
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధిని కల్పించే పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్). ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ ఏడాదిలో 100 రోజుల పనిని కల్పిస్తుంది. ఈ పథకం కింద లబ్దిదారులకు ఆధార్ లేదా బ్యాంకు ఖాతా ద్వారా చెల్లింపులు జరిగేవి. అయితే, లబ్దిదారులకు చేసే చెల్లింపుల విషయంలో మోడీ సర్కారు మార్పులు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 1న ఈ పథకం కింద అన్ని చెల్లింపులను ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ(ఏబీపీఎస్) ద్వారా చేసేలా తప్పనిసరి చేసింది. అంతకముందు, బ్యాంకు ఖాతా ఆధారిత చెల్లింపును ఎంచుకొనే అవకాశం ఉండేది.
మోడీ ప్రభుత్వం ఆధార్ ఆధారిత చెల్లింపులను తీసుకురావడంపై లబ్దిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై ఉపాధి కార్మికులు ఇప్పటికే తమ వ్యతిరేకతను నిరసనల రూపంలో ప్రదర్శించారు. వీరికి సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మద్దతుగా నిలిచారు. మోడీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆధార్ ఆధారిత చెల్లింపులకు కేవలం 43శాతం కార్మికులు అర్హులవుతారనీ, కొత్త చెల్లింపు విధానం ఏ మాత్రమూ పని చేయదని వారు వాదించారు.
ఆధార్ చెల్లింపు నమోదు తుది గడువు విషయాన్ని కేంద్రం పరిశీలించాలని ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా కేంద్రాన్ని ఇప్పటికే కోరింది. ఆధార్ ఆధారిత చెల్లింపులకు 50 శాతం కంటే తక్కువ మందే అర్హులవుతారనీ, కొత్త నిబంధన కారణంగా మొత్తం కార్యక్రమం కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చెల్లింపు వ్యవస్థ అర్హత అవసరాలను తీర్చడానికి ఉపాధి కార్మికులకు తగిన సమయం ఉంటుందని అనుకుంటున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఊహ తప్పు అని ఒక ప్రకటనలో వివరించింది. కొత్త చెల్లింపు విధానం సంక్లిష్టమైనదనీ, గతంలో తీవ్ర సమస్యలను తీసుకొచ్చిందని పేర్కొన్నది. దీనిని తప్పనిసరి చేసే కారణమేదీ లేదని వివరించింది. అకౌంట్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను ఎందుకు నిలిపివేశారన్నదానిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సమాధానం చెప్పలేకపోతున్నదని ఎన్ఆర్ఈజీఏ సంఘర్శ్ ఆరోపించింది.