Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
న్యూఢిల్లీ : అధిక విమాన ఛార్జీలను నియంత్రించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పినరయి విజయన్ లేఖ రాశారు. రద్దీ సమయాల్లో అధిక ఛార్జీలను అరికట్టేందుకు విమానయాన సంస్థలతో చర్చలు జరపాలని కోరారు. గల్ఫ్ దేశాల నుంచి కేరళకు వచ్చే ఛార్జీలు రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయని, పండుగలు, పాఠశాల సెలవులు వంటి సందర్భాల్లో పెంపులు సాధారణ ప్రయాణీకులకు చాలా భారంగా ఉంటుందని తెలిపారు. నెలల తరబడి శ్రమించి సంపాదించిన చిరు పొదుపును టిక్కెట్టుకే వెచ్చించాల్సి వస్తోందని, ఛార్జీలను సవరించాలని కేరళ ప్రభుత్వం, ప్రవాస సంస్థలు చేసిన అభ్యర్థనలను విమానయాన సంస్థలు వినలేదని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లోని అల్పాదాయ కార్మికులకు పండుగలు, సెలవు దినాల్లో సరసమైన ధరలకు ప్రత్యేక సేవలు అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ఏప్రిల్ రెండో వారం నుంచి కేరళ ప్రభుత్వం బుక్ చేసుకున్న కార్యకలాపాలకు త్వరితగతిన అనుమతి ఇవ్వాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను ఆదేశించాలని లేఖలో డిమాండ్ చేశారు.