Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి అమిత్ షాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి అమిత్ షాను సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, నాయకులు కలిశారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీలకు రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జన గణన బీసీ కులాల గణన చేపట్టాలని కోరారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఇతర డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కృష్ణయ్య తెలిపారు.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రిం చాలని డిమాండ్ చేస్తూ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో జంతర్ మంతర్లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై బిఆర్ అంబేద్కర్ ఫొటో ముద్రించే దిశలో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సంఘీభావం తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్లో శుక్రవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటే రాందాస్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నందున వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించాలని కోరారు. వర్గీకరణ అమలయితేనే మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందన్నారు.