Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 జిల్లాల్లో 9, 10 తరగతులకు ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం స్కూళ్లు లేవు
- అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి
అహ్మదాబాద్ : మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో టీచింగ్ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రభుత్వం సాయంతో నడిచే ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ ఉద్యోగాల ఖాళీలు మొత్తం 32 వేలకు పైగా ఉన్నట్టు బీజేపీ సర్కారే రాష్ట్ర అసెంబ్లీలో తెలిపింది. గతేడాది డిసెంబర్ నాటికి 29,122 ఉపాధ్యాయ పోస్టులు, 3,552 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కుబెర్ దిండోర్ ఈ మేరకు సమాచారం వెల్లడించారు.
ఈ సమాచారం ప్రకారం.. గుజరాత్లోని 14 జిల్లాలో అయితే 9, 10 తరగతులకు ప్రభుత్వ మాధ్యమిక ఇంగ్లీషు మీడియం స్కూళ్లు లేకపోవడం గమనార్హం. అలాగే, 11, 12 తరగతులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంగ్లీషు మాధ్యమిక ఉన్నత పాఠశాలలు లేవు. 31 జిల్లాల్లో గ్రాంట్ ఫండెడ్ ఇంగ్లీషు లాంగ్వేజ్ ఎలిమెంటరీ స్కూళ్లు లేవు. డిజిటల్ విద్యలోనూ గుజరాత్లోని పలు జిల్లాలు వెనకబడే ఉన్నాయి. జామ్నగర్-ద్వారక జిల్లాల్లో అనేక స్కూళ్లలో కంప్యూ టర్లు ల్యాబ్లు లేవు. జామ్నగర్లో 490 ప్రాథమిక స్కూళ్లలో, ద్వారకలో 337 ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు లేవు. అలాగే, జామ్నగర్లో 506 ప్రైమరీ స్కూళ్లలో, ద్వారకలో 379 ప్రైమరీ స్కూళ్లలో సైన్సు ప్రయోగశాలలు లేవు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయల లేమిపై రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులు బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతున్నదని గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పృథ్వీ రాజ్ కథవాడియా ఆరోపించారు.