Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త స్పైవేర్ కోసం మోడీ ప్రభుత్వ ప్రయత్నాలు !
- ఫైనాన్షియల్ టైమ్స్ కథనం
న్యూఢిల్లీ : ప్రముఖులపై నిఘా కోసం పెగాసస్‌ను ఉపయోగించి అభాసుపాలైన మోడీ ప్రభుత్వం మరోసారి అటువంటి నిఘా సాధనాల కోసం ప్రయత్నాలు చేస్తోందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పెగాసస్‌ను విక్రయించిన ఇజ్రాయిల్ ఎన్ఎస్ఓ గ్రూపు గురించి బయట బాగా తెలిసినందున ఈసారి అలా కాకుండా బయటి ప్రపంచానికి తక్కువగా తెలిసిన సంస్థల నుండి కొత్త స్పైవేర్‌ను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రాబోయే కాలంలో 120 మిలియన్ల డాలర్లు (రూ.986 కోట్లు) మొత్తాన్ని ఖర్చు చేయాలని మోడీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. దాదాపు డజను వరకు సంస్థలు ఇందుకు సంబంధించిన టెండర్ క్రమంలో పాల్గొంటాయని భావిస్తున్నారు. ఇవన్నీ పెగాసస్ విక్రయ సంస్థ ఎన్ఎస్ఎ గ్రూపునకు ప్రత్యర్ధి కంపెనీలే అయి వుంటాయని భావిస్తున్నారు. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించారా లేదా అని ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా తెలుసుకునే సామర్ద్యం మానవ హక్కుల గ్రూపులకు వుండడం, పైగా ఎవరు లక్ష్యంగా మారారో వారికి యాపిల్, వాట్సాప్‌ల నుండి హెచ్చరికలు వీటన్నింటితో మోడీ ప్రభుత్వ అధికారులు పిఆర్ సమస్య గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. అందువల్ల మరో కొత్త స్పైవేర్ కోసం చూడాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోందని ఈ పరిణామాల గురించి తెలిసిన వ్యక్తులు చెప్పినట్లు ఆ వార్తా కథనం పేర్కొంది. రాబోయే కొద్దేళ్లలో కోటీ 60లక్షల డాలర్ల నుండి 12 కోట్ల డాలర్ల వరకు కాంట్రాక్టులు కుదిరే అవకాశం వుందని ఆ వర్గాలు తెలిపాయి. భారత రక్షణ, ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలిస్తున్న స్పైవేర్ సంస్థల్లో చాలావరకు ఇజ్రాయిల్ మిలటరీ ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం వుందని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం తెలిపింది.
అలా పేర్కొన్న కంపెనీల్లో గ్రీస్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఇంటెలెక్సా వుంది. ఇజ్రాయిల్ మిలటరీ ప్రముఖుల జోక్యంతో ప్రిడేటర్ స్పైవేర్‌ను ఈ సంస్థ సృష్టించింది. ఈజిప్ట్, సౌదీ అరేబియా, మడగాస్కర్, ఒమన్ వంటి దేశాలతో సహా మానవ హక్కుల సూచీలో అట్టడుగున గల దేశాల్లో ఇప్పటికే దీన్ని ఉపయోగించిన సుదీర్ఘ రికార్డు వుంది.
భారత్ జాబితాల్లో వున్న వాటిలో క్వాడ్రెమ్ అని మరో కంపెనీ వుంది. జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత సౌదీ అరేబియాకు స్పైవేర్‌ను విక్రయించిన సంస్థ ఇది. కాగ్నైట్ అనే మరో సంస్థ కూడా మోడీ ప్రభుత్వ పరిశీలనలో వుంది.
ఆయా కంపెనీలతో రాజ్‌నాథ్ నేతృత్వంలోని రక్షణ మంత్రిత్వ శాఖ జరుపుతున్న చర్చలు అడ్వాన్స్ దశలో వున్నాయి. అయితే లాంఛనప్రాయమైన 'ప్రతిపాదనకు అభ్యర్ధనలు' పంపడానికి ఇంకా చాలా వారాలు పడుతుంది. వీటిల్లో ఏ కంపెనీ కూడా ఈ కథనంపై స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. రక్షణ శాఖ కూడా వ్యాఖ్యానించడానికి అందుబాటులోకి రాలేదు.
క్రమబద్ధీకరణలో లేని స్పైవేర్ పరిశ్రమపై ఆంక్షలు విధించడానికి అమెరికా నేతృత్వంలో తాజా ప్రయత్నాలు జరిగాయి. నిఘా కోసం నిరంకుశ ప్రభుత్వాలు ఉపయోగించే వాణిజ్యపరమైన స్పైవేర్‌ను ప్రభుత్వం ఉపయోగించడాన్ని నిషేధిస్తూ మార్చి 27న అమెరికా ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చింది.
అమెరికా ఆతిథ్యమిచ్చిన ప్రజాస్వామ్య సదస్సులో గురువారం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ఆస్ట్రేలియా, కెనడా, కోస్టారికా, డెన్మార్క్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలన్నీ కలిసి స్పైవేర్ వినియోగానికి చట్టబద్ధమైన యంత్రాం గాలను రూపొందించి, అమలు చేయడానికి ఒక తాటి పైకి వచ్చాయని చెప్పారు. ఇటువంటి సాధ నాల దుర్వినియోగం చాలా ఎక్కువగా వుందని, మన జాతీయ భద్రతకు ముప్పు పెరిగిందని వైట్‌హౌస్ గురువారం సంయుక్త ప్రకటనలో పేర్కొంది. అయితే చాలా ప్రభుత్వాలకు తమ స్వంత ఇంటెలిజెన్స్ వర్గాలు రూపొందించిన నిఘా సాధనాలు వున్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.