Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 28న రక్షణ రంగ ఉద్యోగుల ఆందోళన : ఆలిండియా డిఫెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
రక్షణ పరిశ్రమలో ట్రేడ్ యూనియన్ హక్కులు, కార్మికుల హక్కులపై పెరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఏప్రిల్ 28న అఖిల భారత నిరసన దినంగా పాటించాలని ఆలిండియా డిఫెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏఐడీఈఎఫ్) పిలుపు ఇచ్చింది. రక్షణ రంగంలో ఇప్పటికే అనేక ఆందోళనలు జరిగిన నేపథ్యంలో ఏఐడీఈఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం ఈ నెల 29, 30 తేదీల్లో తమిళనాడులోని అరువంకాడులో జరిగింది. ఈ సందర్భంగా ఏఐడీఈఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఎస్.ఎన్ పాఠక్ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది. రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న 4 లక్షల మంది డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని తెలిపింది. ఇప్పటికే 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కార్పొరేటీకరించారని, ఇప్పుడు ఎంఈఎస్ కార్పొరేటీకరణ గురించి రక్షణ మంత్రిత్వ శాఖలో చర్చ జరుగుతోందని తెలిపింది. డీఆర్డీఓ, నేవి, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లలో పెద్ద ఎత్తున అవుట్సోర్సింగ్ జరుగుతోందని పేర్కొంది. డీఆర్డీఓ ప్రాజెక్టులను ప్రైవేట్ రంగానికి అప్పగిస్తున్నారు. డిజిక్యూఎని తగ్గించేందుకు జాతీయ ఉత్పాదక మండలి నివేదికను అమలు చేయాలనే ప్రతిపాదన రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. డిజిక్యూఎను తగ్గించడం వల్ల రక్షణ మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న 20.90 లక్షల పోస్టులను భర్తీ చేయలేదు. ముంబాయిలోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపోతో సహా వివిధ ఆర్డినెన్స్ డిపోలు మూతపడనున్నాయని తెలిపింది. ప్రభుత్వం వాటాదారులు (గుర్తింపు పొందిన డిఫెన్స్ సివిలియన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్)లతో ఎలాంటి చర్చలు జరపకుండానే ఈ నిర్ణయాలన్నింటితో మోడీ సర్కార్ ముందుకెళ్తుందని విమర్శించింది. ఏఐడీఈఎఫ్ సహా ఫెడరేషన్ల ప్రాతినిధ్యాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ధ్వజమెత్తింది. జేసీఎం పనితీరును స్తంభింపజేయడానికి పీఎంఓ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇస్రో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్మీ వర్క్‌షాప్‌లలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు జరగలేదు.
కేంద్రం నిర్లక్ష్యం సి.శ్రీకుమార్,
ఏఐడీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి
ఏఐడీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి సి.శ్రీకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం కార్మిక సంఘాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందనీ, దేశంలోని శ్రామికశక్తికి ప్రాతినిధ్యం వహించే కార్మిక సంఘాలు కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలేనన్న వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. ఇండియా ఐఎల్ఓ వ్యవస్థాపక సభ్య దేశమని తెలిపారు. ఐఎల్ఓ ప్రకారం కార్మికులకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి, క్రమబద్ధీకరించడానికి అన్ని సభ్య దేశాలు ప్రతి సంవత్సరం తమ లేబర్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేయాలని, అయితే ప్రస్తుత ప్రభుత్వం 2015 తరువాత ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు.
కార్మిక చట్టాలను తారుమారు చేసి, కార్మిక సంఘాల అభిప్రాయాలను విస్మరిస్తూ కార్పొరేట్ అనుకూల లేబర్ కోడ్లుగా మారుస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఫిర్యాదులను చర్చించి పరిష్కరించేందుకు 1966లో ఏర్పాటైన జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జేసీఎం) నిర్వీర్యమైందని పేర్కొన్నారు. జేసీఎంలో ఉద్యోగుల తరపున తాను ప్రాతినిధ్యం వహించినప్పటికీ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ జేసీఎం సమావేశాన్ని నిర్వహించలేదని విమర్శించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ, ఉద్యోగాల తొలగింపు పేరుతో పోస్టుల రద్దు, ఆ ఉద్యోగాలను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల పని నిరాకరణ, ఎంఈఎస్‌ను కార్పొరేటీకరించే ప్రతిపాదన, మూసివేత వంటి డిఫెన్స్ సివిల్ ఉద్యోగులను ప్రభావితం చేసే నిర్ణయాలన్నీ మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటుందని దుయ్యబట్టారు. ఆర్మీ వర్క్‌షాప్‌లు, డిపోలలో జీఓసీఓ మోడల్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎక్స్-ట్రేడ్ అప్రెంటీస్లను ఉపయోగించుకోవడం వంటివి రక్షణ మంత్రిత్వ శాఖలో జరుగుతున్నాయని తెలిపారు.