Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరబిందో శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరైంది. తన భార్య కనికా రెడ్డి అనారోగ్య కారణంగా బెయిల్ కావాలని ఆయన వేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు, నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆయన త్వరలోనే విడుదల కానున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయనకు చెందిన మూడు కంపెనీల ద్వారా రూ.64 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్లు ఈడి గుర్తించింది.
అయితే పూచీకత్తుతో పాటు కొన్ని షరతులు కూడా న్యాయస్థానం విధించినట్లుగా తెలుస్తోంది. 2022 నవంబర్ 9న శరత్ చంద్రారెడ్డిని ఈడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరిలోనూ శరత్ చంద్రారెడ్డికి కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బెయిల్ మంజూరు చేయాలని శరత్ చంద్రారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు జనవరి 27న 14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్పుడు కూడా రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు కొన్ని షరతులు కూడా పెట్టింది. ఈ గడువు ముగిసిన తరువాత ఆయన తిరిగి తీహార్ జైలుకు వెళ్లారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకు శరత్ రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థతో పాటు పలు సంస్థల్లో శరత్ చంద్రారెడ్డికి భాగస్వామ్యం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన సౌత్ గ్రూప్‌కు ప్రతినిధిగా ఉన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్పోర్ట్ కేంద్రంగా నగదు బదిలీ అయినట్లుగా ఈడి అభియోగం మోపింది. ప్రైవేట్ జెట్ విమానాల ద్వారా నగదు తరలించినట్లుగా పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి భార్య నడుపుతోన్న కనికా టెక్రివాల్ సంస్థ ద్వారా లావాదేవీలు జరిగినట్లుగా తెలిపింది. జెట్ సెట్ గో సంస్థ ద్వారా డబ్బులు బదిలీ అయినట్లుగా పేర్కొంది. ప్రస్తుతం జెట్ సెట్ గో సంస్థ సిఈవోగా శరత్ చంద్రారెడ్డి భార్య పనిచేస్తున్నారు. దీనిపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఈడి వివరాలు కోరింది.