Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురికి గాయాలు..కాషాయ దుండగుల దుశ్చర్య
- మహారాష్ట్రలోని గాంధీ వర్సిటీలో అర్ధరాత్రి ఘటన
ముంబయి : మహారాష్ట్రలో కాషాయ గుండాలు రెచ్చిపోయారు. నిరవధిక దీక్షలో ఉన్న దళిత స్కాలర్లపై దాడికి దిగారు. 'జై శ్రీరామ్' నినాదాలు చేసుకుంటూ వారిని పిడిగుద్దులు గుద్దారు. కులం పేరుతో దూషించారు. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న ఇతర విద్యార్థుల మొబైల్ ఫోన్లను లాక్కొని బెదిరించారు. మహాత్మాగాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయ (ఎంజీఏహెచ్‌వీ)లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, బాధిత విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పీహెచ్డీ స్కాలర్ అయిన రాజ్నీశ్ కుమార్ అంబేద్కర్‌తో పాటు అతని సహ విద్యార్థులు ఐదు రోజుల నిరసన దీక్షలో ఉన్నారు. తన పీహెచ్డీ థీసిస్‌ను మూల్యాంకనం చేయాలనే డిమాండ్‌తో దళిత స్కాలర్ రాజ్నీశ్ అంబేద్కర్ ఈ నిరసనను చేస్తున్నాడు. అయితే, ఈ విషయంలో యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం స్పందించలేదు.
విద్యార్థుల మొబైల్ ఫోన్లు లాక్కొని..
శనివారం రాత్రి కొందరు కాషాయ గూండాలు దొంగ చాటుగా క్యాంపస్‌లోకి ప్రవేశించారు. రాజ్నీశ్తో పాటు ఇతర విద్యార్థులపై కాషాయమూక దాడికి తెగబడింది. 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేసింది. ఐదు రోజుల దీక్షను భగం చేయాలని యత్నించింది. నిరసన చేస్తున్న విద్యార్థులపై ఇష్టం వచ్చినట్టు భౌతిక దాడికి దిగింది. అక్కడ నిశబ్దంగా ఉన్న వాతావరణాన్ని హింసాత్మకంగా మార్చింది. గుండాలు కులం పేరుతో ఇష్టం వచ్చినట్టుగా దూషించారు. జరుగుతున్న ఈ అల్లరిని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న ఇతర విద్యార్థులను దుండగులు బెదిరించారు. వారిని ఫోన్లను లాక్కొని వీడియోలు, ఫోటోలను తొలగించారు. ఎవరైనా ఫోటోలు, వీడియోలు తీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాషాయ గుండాలు అక్కడి విద్యార్థులను హెచ్చరించారు.
భద్రతా సిబ్బంది ఉన్నా..
ఈ ఘటన గురించి కొందరు విద్యార్థులు పోలీసులకు తెలపడంతో వారు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఉదయం 4 గంటలకు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారని రాజ్నీశ్ అంబేద్కర్ చెప్పాడు. మరికొందరికి స్వల్పంగా గాయాలయ్యాయని తెలిపాడు. ప్రధాన గేటు మూసివేసి ఉన్నదనీ, క్యాంపస్‌లో భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ.. దుండగులు, కొందరు బయటి వ్యక్తులు వర్సిటీ లోపలికి వచ్చి.. క్యాంపస్ లోపల ఉన్న వారికి సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఈ హింసకు తెగబడ్డారు.
దాడిని ఖండించిన దళిత సంఘాలు
కుల పక్షపాతం చూపెడుతున్న యూనివర్సిటీకి వ్యతిరేకంగా, తమ డిమాండ్ల సాధన కోసం నిరసన చేస్తున్న దళిత పరిశోధకలు, స్కాలర్లపై కాషాయ మూకల దాడిని తాము ఖండిస్తున్నట్టు రాజ్నీశ్ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ దాడిని ఇతర దళిత సంఘాలు కూడా ఖండించాయి.