Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయసమ్మతం కాని సుదీర్ఘ జైలు సరికాదు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : న్యాయసమ్మతం కాని పద్ధతిలో ఎవరూ జైలు శిక్ష అనుభవించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరాలను నిరోధించడం, శాంతి భద్రతలను కాపాడటం రాష్ట్రాల బాధ్యత అయినప్పటికీ, వ్యక్తిగత స్వేచ్ఛను బలిపెట్టకూడదని పేర్కొంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 167 (2)లోని ప్రొవిసో (ఎ) ప్రకారం రిమాండ్ తేదీ నుంచి 60 రోజులలోపు దర్యాప్తు చేస్తున్న సంస్థ చార్జీషీటు దాఖలు చేయడంలో విఫలమైతే, నిందితుడు డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులు. నిర్దిష్ట కేటగిరీ నేరాలకు, నిర్ణీత వ్యవధిని 90 రోజుల వరకు పొడిగించవచ్చు. రిమాండ్ విధించిన తేదీ నుంచే ఆ గడువును లెక్కించాలా? ఆ రోజును మినహాయించా లా? అనే చట్టపరమైన వివాదం సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది. ఈ అంశంపై జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్రారు, జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సెక్షన్ 167 సీఆర్పీసీ కింద నిర్దేశించిన 60/90 రోజుల రిమాండ్ వ్యవధిని మేజిస్ట్రేట్ రిమాండ్‌కు పంపించిన తేదీ నుంచి లెక్కించాలని ధర్మాసనం పేర్కొంది. ''న్యాయ సంస్థల ఆదేశం లేకుండా ఎవరూ జైలు శిక్ష అనుభవించకూడదు. అయితే, నేరాలను నిరోధించడం, శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్రం బాధ్యత వహిస్తుంది, వ్యక్తిగత స్వేచ్ఛను బలిపెట్టకూడదు'' అని ధర్మాసనం పేర్కొంది. నిర్ణీత 60/90 రోజుల వ్యవధిలో చార్జిషీటు లేదా రిమాండ్ కోసం అనుబంధ అభ్యర్థనను దాఖలు చేయడంలో రాష్ట్రం విఫలమైతే, వ్యక్తి హక్కులు, ఆ హక్కులపై పరిమితి మధ్య సమతుల్యతను పాటించాలని, దీర్ఘకాలం నిర్బంధించకుండా నిరోధించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 'అధికారులు నిందితులను నిర్బంధించడానికి, దర్యాప్తును సులభతరం చేయడానికి చట్టం అనుమతిస్తుంది. సుదీర్ఘమైన జైలు శిక్షను నిరుత్సాహపరచడం కోర్టు బాధ్యత. డిఫాల్ట్ బెయిల్ హక్కు తదుపరి చార్జిషీటు దాఖలు చేయడం ద్వారా ఆపివేయబడదు. డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు కొనసాగుతోంది'' అని ధర్మాసనం పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) డైరెక్టరేట్ విచారిస్తున్న యెస్ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో డిహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్లు కపిల్ వధావన్, ధీరజ్ వధావన్‌లకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు న్యాయపరమైన ప్రశ్న తలెత్తడంతో, సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశంపై స్పష్టతనిచ్చింది.