Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎస్‌యుల్లో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచించాలి
- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
న్యూఢిల్లీ : దేశంలోని ఏకైక ప్రభుత్వ యాజమాన్య షిప్పింగ్ కంపెనీ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సిఐ)లో పెట్టుబడుల ఉపసంహరణ (ప్రయివేటీకరణ) సహేతుకం కాదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. అలాగే లాభదాయక, ప్రధాన రంగ ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యు)ల్లో పెట్టుబడుల ఉపసంహరణ చర్యను తప్పుపట్టింది. ఇటీవల పార్లమెంట్లో రవాణా, పర్యాటకం, సంస్కృతి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి సమర్పించిన నివేదిక లాభదాయకమైన, ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను వ్యతిరేకించింది. ''నష్టాల్లో ఉన్న పీఎస్‌యుల (ప్రభుత్వ రంగ సంస్థలు) పెట్టుబడుల ఉపసంహరణను సమర్థించవచ్చు. అయితే ముఖ్యంగా ప్రధాన రంగాలలో మంచి పనితీరు కనబరుస్తున్న పిఎస్‌యులు స్వల్పకాలిక ఆర్థిక లాభాల కోసం త్యాగం చేయకూడదు''అని పేర్కొంది. లాభదాయకమైన పిఎస్‌యుల, ముఖ్యంగా ప్రధాన రంగాలలో పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని సిఫార్సు చేస్తూ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి వ్యూహాత్మక ఆస్తి దాని ఆర్థిక విధానానికి మాత్రమే కాకుండా సముద్ర భద్రతకు కూడా కీలకమని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.
2020 నవంబర్‌లో ఎస్‌సీఐలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నెల తరువాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఎస్సిఐలో తన మొత్తం 63.75 శాతం వాటాను ఉపసంహరించుకోవడానికి ఆసక్తి వ్యక్తీకరణని ఆహ్వానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో ఎస్సీిఐ రూ.468 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది 5.311 మిలియన్ డిడబ్ల్యుటి (డెడ్‌వెయిట్ టన్నేజ్), 2.94 మిలియన్ జిటి (స్థూల టన్నేజ్), దాదాపు 26 శాతం భారతీయ టన్నులతో 59 నౌకలను కలిగి ఉంది.
జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాలను పరిరక్షించడానికి సమతుల్యతను కొనసాగించాలని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. ''ఎస్సిఐ దేశంలోని అతిపెద్ద వ్యాపారి కార్గో క్యారియర్ మాత్రమే కాదు, ఇది భారతీయ ఆఫ్‌షోర్ మెరైన్ వ్యాపారంలో కూడా వైవిధ్యభరితంగా ఉంది. అత్యంత ప్రత్యేకమైన నౌకలను నిర్వహించడంలో, నిర్వహణలో నైపుణ్యాన్ని పొందింది'' అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.