Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గో రక్షకుల పేరుతో ముస్లిం వ్యక్తిపై దాడి
బెంగళూరు: గో రక్షణ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠా..తామడిగిన రూ.2 లక్షలు ఇవ్వలేదనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తిని కొట్టి చంపేసింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటక రాష్ట్రంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..పశువుల వ్యాపారి ఇద్రిస్ పాషా సంత నుంచి శనివారం ఒక వాహనంలో పశువులను తరలిస్తున్నాడు. పునీత్ కెరెహళ్లి నేతృత్వంలోని కొందరు గో సంరక్షకులమనే పేరుతో ఇద్రిస్ పాషాను రామనగర జిల్లాలోని సాత్నూర్ గ్రామం వద్ద అడ్డుకున్నారు. రెండు లక్షల రూపాయలివ్వాలని డిమాండ్ చేశారు. అందుకు పాషా నిరాకరించాడు. సంత నుంచి కొన్న వాటిని తరలించేందుకు అనుమతి ఉన్న పత్రాలను వారికి చూపించాడు. అయినప్పటికీ పునీత్, అతడి అనుచరులు వదల్లేదు. తాము డబ్బులడిగితే ఇవ్వలేదనే కక్షతో పాషాను దారుణంగా కొట్టి చంపారు. మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి పునీత్, అతని అనుచరులపై హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. కర్నాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.