Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ : పరువు నష్టం కేసులో తనపై విధించిన రెండేండ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారని సమాచారం. ఈ కేసులో పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. సూరత్ కోర్టు తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్లో రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తున్నట్టుగా పేర్కొంది. అనర్హత వేటు కోర్టు తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్లో తెలిపింది. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి విజయం సాధించారు. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్‌సభ సభ్యత్వం దక్కుతుంది. కానీ, ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్ధిస్తే రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అప్పుడు రాహుల్ ఎనిమిదేండ్లపాటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు.ఇదే వ్యాఖ్యలకు సంబంధించి బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ దాఖలు చేసిన మరో పరువు నష్టం కేసును కూడా గాంధీ ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 12న తమ ముందు హాజరుకావాలని పాట్నా కోర్టు రాహుల్ గాంధీని ఆదేశించింది.