Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులాల మధ్య భిన్నాభిప్రాయాలుండొచ్చు.. కానీ వివక్షే కీలకం
- జాతీయ సదస్సులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్
న్యూఢిల్లీ : సామాజిక న్యాయం పరిరక్షణ అందరి బాధ్యతని, అందుకు ఐక్యతే కీలకమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పేర్కొన్నారు. సోమవారం నాడిక్కడ ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో జరిగిన ఈ సదస్సలో కొంత మంది భౌతికంగా, మరికొంత మంది ఆన్లైన్లో పాల్గొన్నారు. ''సామాజిక న్యాయ కోసం జరిగే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లటం, సామాజిక న్యాయం సాధనకు జాతీయ సంయుక్త కార్య క్రమం'' అనే అంశంపై జరిగిన సదస్సులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అధ్యక్షోపన్యాసం చేశారు. సామాజిక న్యాయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకు అందరు కలిసి ఉండాలని కోరారు. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదనీ, అలాగని కొన్ని రాష్ట్రాలకు సంబంధించినది కాదని, సామాజిక న్యాయం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. భారత సమాజ నిర్మాణంతో కలిసి ఉందని తెలిపారు. కులలు, వర్గాల సమస్యల పట్ల రాష్ట్రాల మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చనీ, కాని కుల వివక్ష అనేది ముఖ్యమైన అంశమని అన్నారు. వివక్ష, అంటరానితనం, బానిసత్వం, అన్యాయం వంటి విషానికి సామాజిక న్యాయమే మందు అని పేర్కొ న్నారు. సామాజిక న్యాయంలో భాగంగానే రిజర్వేషన్లు వచ్చా యని తెలిపారు. బీజేపీ ఎస్‌డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తుందనీ, ఇది సామాజిక న్యాయం కాదని అన్నారు. పేద లకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే, దాన్ని ఆర్థిక న్యాయ మంటారని, సామాజిక న్యాయం కాదని తెలిపారు. కొంత మంది పేదలు, అన్ని కులాల్లో పేదలతో సమానం కాదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో పేదలు ఆర్థిక, సామాజిక అణచివేతకు గురవుతున్నారని తెలిపారు. రిజర్వేషన్ ప్రతిభకు వ్యతిరేకమని చెప్పిన బీజేపీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తుందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ, 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడంలో లాజిక్ ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రతిభకు వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించారు. కర్నాటకలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్ కోటాను రద్దు చేసి, 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను పొందుపరిచారని విమర్శించారు. బీజేపీ ఓట్ల కోసమే పని చేస్తుందని, కర్నాటకలో సామాజిక న్యాయం హత్యకు గురయిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని, న్యాయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదోన్నతల్లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని,
కేంద్ర ప్రభుత్వం కుల జనగణన చేయాలని, గణాంకాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశామని, అలాగే సామాజిక న్యాయం పర్వవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. మేథావులు, న్యాయ నిపుణులు, అధికారులతో ఉన్న ఇలాంటి కమిటీలు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ సామాజిక భద్రత అవసరమనీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం జరగాలని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్లు కావాలని అన్నారు. వివిధ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ మాట్లాడుతూ కుల గణన చేయాలని డిమాండ్ చేశారు. తాము కూడా సామాజిక న్యాయంపై కార్యక్రమం నిర్వహిస్తామని, అందురూ పాల్గొనాలని కోరారు. ఎస్పి అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ సామాజిక విముక్త సమాజం స్థాపనకు అందరం కలిసి పని చేయాలని అన్నారు. ప్రస్తుతం సామాజిక న్యాయం అవసరం ఉందని తెలిపారు.
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ అందరి కోసం దేశం అభివద్ధి కావాలనీ, ఏండ్ల తరబడి అణచివేతకు గురవుతున్న, పేదరికంలో మగ్గిపోతున్నవారికి మంచి జీవితం ఇవ్వడమే లక్ష్యంగా ఉండాలన్నారు. అందుకోసం అందరం ఐక్యంగా ఉండాలని సూచించారు.
జస్టిస్ వి. ఈశ్వరయ్య స్వాగతోపన్యాసం చేస్తూ ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది ప్రతిదీ ప్రతి ఒక్కరి కోసం అనే లక్ష్యంతో ఏర్పడిందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని, దాన్ని వాస్తవంగా అమలు చేయాలని కోరారు. స్వేచ్ఛా, సమానత్వాలతో ఆర్థిక, సామాజిక, రాజ కీయ న్యాయం అందించడమే రాజ్యాంగం స్ఫూర్తి అని పేర్కొన్నారు. అదే గౌరవమని అన్నారు. జన గణనలో కుల గణన చేయాలని, న్యాయ, శాసన, పరి పాలనలో ఎస్సి, ఎస్టి, ఒబిసిలకు జనాభా ప్రాతి పదికన ప్రాతినిధ్యం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒబిసి రిజర్వేషన్, మహిళ రిజర్వేషన్లను కల్పించాలని అన్నారు. ఈ సదస్సులో ఎంపీ పి. విల్సన్ (డీఎంకే), డెరెక్ ఓబ్రెయిన్ (టీఎంసీ), ఛగన్ భుజ్బాల్ (ఎన్సీపీ), ఈటి. మహ్మద్ బహీర్ (ఐయుఎంఎల్), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), సంజయ్ సింగ్ (ఆప్), రాజ్ కుమార్ సైనీ (ఎల్ఎస్పీ), మహాదేవ్ జంకర్ (ఆర్ఎస్పీ), వీరప్ప మొయిలీ (కాంగ్రెస్), వి.తిరుమ లవన్ (వీకేసీ), వైకో (ఎండీఎంకె), దేవరాజన్ (ఫార్వర్డ్ బ్లాక్), పిఎజిఎఎఎఎం జాతీయ కన్వీనర్ బిఎన్ వాఘా, ఎఐఎఫ్ఒబిసిఈడబ్ల్యుఎ ప్రధాన కార్యదర్శి జి.కరుణానిధి, బిఎఎంసిఈఎఫ్ అధ్యక్షుడు వామన్ మేష్రామ్, పిపిఐడి నేత బి.డి బ్రోకర్, రాజ్యాంగ పరిరక్షణ సంఘర్ష సమితి కన్వీనర్ అనిల్ జైహింద్, పివిఎస్ఎస్ఎం ఆర్గనైజర్ బహుదూర్ సింగ్ లోథి, ద్రావిడర్ ఖజగం అధ్యక్షుడు కె.వీరమణి, ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్లు లక్ష్మణ్ యాదవ్, రతన్ లాల్, సూరజ్ మండల్, సీనియర్ జర్నలిస్టులు దిలీప్ మండల్ ప్రసంగించారు. ఈ సదస్సును జస్టిస్ వీరేంద్ర సింగ్ యాదవ్ ముగించారు.
మన ఐక్యతే కీలకం
ఉద్యమాలకు సిద్ధం కావాలి...
దేశంలో సామాజిక న్యాయం హామీ కోసం ఉద్యమాన్ని కొనసాగించాలి.సామాజిక న్యాయ ఉద్యమంలో సమానత్వం, ఆత్మ గౌరవం వంటి అంశాలు చాలా కీలమైనవి.'సామాజిక న్యాయంలో కీలకమైన రిజర్వేషన్లు ఆర్థిక సాధికారితకు నాంది పలకాలి. రిజర్వేషన్లతో వచ్చిన ఆర్థిక సాధికారిత శతాబ్దాలుగా కుల అణచివేతకు గురైన వారికి ఆత్మ గౌరవాన్ని ఇస్తుంది. దీంతో సామాజిక అణచివేతకు ముగింపు పడుతుంది. ఇది అవసరం. ఆర్థిక వృద్ధి లేనిదే ఆర్థిక సాధికారిత సాధ్యం కాదు. అయితే ఆర్థికాభివృద్ధి అనేది కొంత మందికి మాత్రమే సంబంధించినదిగా ఉంది. మిగతా ప్రజానీకం దీనికి బయట ఉన్నారు. దేశంలోని 40.5 శాతం సంపద ఒక శాతం వద్దే ఉంది. కింద నున్న 50 శాతం ప్రజల్లో కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉంది. దేశంలో ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించింది. ఆర్ధిక సాధికారిత సామాజిక న్యాయానికి హామీ ఇవ్వాలి. కార్పొరేట్, కమ్యూనల్ బంధంతో ఒకపక్క ఆర్థిక దాడి, మరోపక్క మతోన్మాద దాడి జరుగుతున్నది. దీన్ని ఎదుర్కోవాల్సి ఉంది.రిజర్వేషన్లు అంతం చేయాలని చూస్తున్నారు.లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, సామాజిక న్యాయం, సమాఖ్యవాదాన్ని పరిరక్షించుకోవడం చాలా ముఖ్యం.
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
సామాజిక వాస్తవికతను అర్థం చేసుకోవాలి...
ఎక్కువ మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కాకపోవడానిక గల కారణాలను గుర్తించాలి. . విద్య అనేది కేవలం చైతన్య వంతులను చేయడానికి మాత్రమే కాదు. యువతలో స్ఫూర్తిని నింపడానికి ఉపయోగించాలి.సామాజిక న్యాయమనేది చాలా సుదీర్ఘమైన అంశం. కనుక సామాజిక వాస్తవికతను అర్థం చేసుకోవాలి.
- బీఆర్ఎస్ నేత కె కేశవరావు
సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటం కీలకమైనది. రాజకీయ, ఆర్థిక సంస్కరణ జరగాలి.కుల సమాజం, వర్గ దోపిడీ అంతం కావాలి.కుల రహిత, వర్గ రహిత సమాజం నిర్మించాలి.ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి.
- సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా