Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ల లాభాల కోసం వారి జీవనోపాధిపై వేటు
- బడ్జెట్లో మత్స్య పరిశ్రమకు అరకొర కేటాయింపు
- ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్ పార్లమెంట్ మార్చ్‌లో తపన్ సేన్, హేమలత
న్యూఢిల్లీ :మోడీ పాలనలో దేశంలోని మత్స్య కారులు, కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.హేమలత, తపన్‌సేన్ విమర్శించారు. కార్పొరేట్ల లాభాల కోసం వారికి సముద్ర తీర ప్రాంతాన్ని తాకట్టుపెట్టి మత్స్యకారుల పొట్ట గొడుతున్నదన్నారు. సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్డబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ జరిగింది. సీపీఐ(ఎం) ఎంపీలు వి.శివదాసన్, ఎ.ఎ.రహీమ్ సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఎఐఎఫ్ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ జాతీయ అధ్యక్షులు దేబ్శశి భర్మన్ అధ్యక్షతన జరిగిన ధర్నాను తపన్ సేన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపుల్లో మత్స్య పరిశ్రమ పట్ల మోడీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు, కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనీ, పెన్షన్, ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. కె.హేమలత మాట్లాడుతూ చేపలు ఎగుమతి చేసేందుకు మత్స్యకారులను అనుమతించ ట్లేదనీ, సముద్ర ప్రాంతాన్ని వివిధ వ్యాపారాల(హౌటళ్లు, రెస్టారెంట్లు, అతిథి గృహాలు వంటి వ్యాపార సంబంధిత వ్యవహారాలు)వారికి అప్పగిస్తున్నారని విమర్శించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జైళ్లలో మన దేశ మత్స్యకారులు మగ్గుతున్నారన్నారు. వారిని విడిపించి దేశానికి తీసుకురావాలనే సోయిని మోడీ సర్కారు మరి చిందని విమర్శించారు. మెజార్టీ మత్స్య సహకార సంఘాలు మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయాయనీ, మత్స్యకారుల నుంచి అధిక రుసుము వసూలు చేస్తున్నారని విమర్శించారు. చేపలు శుద్ధి చేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వటం లేదనీ, కార్పొరేట్లు మాత్రం లాభాలు పొందుతున్నారని తెలిపారు. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ మాట్లాడుతూ..మోడీ ప్రభుత్వ విధానాలు మత్స్యకారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని విమర్శించారు. సాగరమాల ప్రాజెక్టుతో భూములు సేకరిస్తున్నారనీ, దీనివల్ల మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో విదేశాల నుంచి చేపల దిగుమతికి సంతకాలు చేశారనీ, ఇది దేశంలోని మత్స్యకారులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నదని విమర్శించారు.
ఎఐఎఫ్ఎఫ్డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి పుల్లివెల స్టాన్లీ మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల వల్ల మత్స్యకారులు, చేపల విక్రయదారులు, చేపల ప్రాసెసింగ్ కార్మికులు తదితర అన్ని వర్గాల వారు నానా అవస్థలు పడుతున్నారన్నారు. పేదరికం, అప్పులు, కష్టాలలో జీవిస్తున్నారని తెలిపారు. సామాజిక అణచివేతను కూడా ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఎఐఎఫ్ఎఫ్డబ్ల్యూఎఫ్ కోశాధికారి జి.మమత, కేరళ మత్స్య ఫెడ్ చైర్మెన్ టి. మనోహరన్, జాతీయ ఉపాధ్యక్షులు మహఫజ్ రహమాన్, జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ నుంచి గోరెంకల నరసింహ, పగడాల నాగేశ్వరరావు, సీహెచ్.శంకర్, విజరు కుమార్, ఎం.మోహన్, టి.ఇస్తారి, జి.వెంకట్, ఎం.రమేష్, ఆంధ్రప్రదేశ్ నుంచి సీహెచ్ రమణి, వై.శ్రీనివాస్, ఎస్.కళావతి, పి. నారాయణ, సిహెచ్ రమేష్ పాల్గొన్నారు.
కేంద్ర మంత్రికి వినతి
మత్స్యకారుల సమస్యలపై కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలాను ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్ బృందం కలిసింది. ఈ సందర్భంగా ఐదు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. మత్స్యకారులకు కిరోసిన్, డీజిల్‌ను సబ్సిడీపై అందించాలనీ, చేపల వేటకు సబ్సిడీల ఉపసంహరణపై డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. మెరైన్ ఫిషరీస్ బిల్లు ముసాయిదా, బ్లూ ఎకానమీ పాలసీని ఖరారు చేసే ముందు మత్స్యకారులు, మత్స్య కార్మికుల ప్రతినిధులతో చర్చించాలని కోరింది. చేపల ప్రాసెసింగ్ కార్మికులు, అనుబంధ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, అన్ని కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. సముద్ర తీరం, మడ అడవులు, తీర ప్రాంతాలను రక్షించడానికి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నియమాలను సమర్థవంతంగా అమలు చేయాలనీ, తీర ప్రాంతాల్లో నివసించే వారు తమ ఇండ్లను ఆధునీకరించుకునేందుకు అనుమతించాలని కోరింది. మత్స్యకారుల సహకార సంఘాలకు నామమాత్రపు ధరలకు ఫిషింగ్ కోసం కేంద్ర ప్రభుత్వ నీటి వనరులను అందించాలని డిమాండ్ చేసింది.
దుబ్బల కొలువు కళాకారుల వృత్తిని గుర్తించండి
ఈ ధర్నాలో దుబ్బుల కొలుపు కళాకారుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాటూరి దేవేందర్, జునగరి దుర్గయ్య ఆధ్వర్యంలో వందలాది మంది దుబ్బుల కొలుపు కళాకారులు తమ కళా ప్రదర్శన చేశారు. జాతీయస్థాయిలో దుబ్బుల కొలుపు కళాకారుల వృత్తిని గుర్తించి జాతీయ గెజిట్‌లో ఎక్కించాలని డిమాండ్ చేశారు.