Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీ పని చేసుకుంటూ పోండి
- సీబీఐ అధికారులకు ప్రధాని మోడీ హితబోధ
- ఘనంగా సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకలు
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
దేశాభివృద్ధికి అవినీతే పెద్ద అవరోధంగా మారిందనీ, సీబీఐ అధికారులు తమ పనిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా షిల్లాంగ్, పూణే, నాగ్‌పూర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సీబీఐ కాంప్లెక్స్‌లను ప్రారంభించారు. ఉత్తమ దర్యాప్తు అధికారులకు పతకాలను ప్రదానం చేశారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాల స్మారకార్ధం పోస్టల్ స్టాంపు, నాణెం విడుదల చేశారు. సీబీఐ కొత్త ట్విటర్ హ్యాండిల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)సత్యం, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందన్నారు. ఏదైనా కేసు పరిష్కారం కోసం సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉందని అన్నారు. ఇలాంటి సంస్థలు లేకుండా అభివృద్ధి భారతాన్ని నిర్మించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 'సీబీఐ ఎవరి మీద చర్యలు తీసుకున్నదో వారి గురించి మాట్లాడుతున్న వ్యక్తులు చాలా శక్తివంతులు. వాళ్లు ప్రభుత్వంలో, వ్యవస్థలో ఏళ్ల తరబడి ఉన్నారు. ఈ రోజుకు కూడా వాళ్లు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. సీబీఐ అధికారుల్లారా మీ పని మీదే దృష్టి ఉంచండి. అవినీతిపరులైన ఏ ఒక్కరినీ వదలకండి. ఎంతటి శక్తివంతులైనా బెదరవలసిన పనిలేదు' అని హితబోధ చేశారు. బ్యాంకు మోసాల నుంచి వన్యప్రాణుల సంబంధిత మోసాల వరకూ కేసులు పెరుగుతుండటంతో సీబీఐ పని అనేక రెట్లు పెరిగిందన్నారు. ప్రజాస్వామ్యం, న్యాయానికి అవినీతి పెద్ద అవరోధమనీ, అవినీతి రహిత దేశాన్ని రూపొందించడమే సీబీఐ ప్రధాన బాధ్యత అని నొక్కి చెప్పారు. పేద ప్రజల హక్కులను అవినీతి ఊడలాక్కుంటుందని, అనేక మంది నేరగాళ్లుగా మారడానికి దారితీస్తుందని చెప్పారు. బ్లాక్ మనీ, బినామీ ఆస్తులపై తమ ప్రభుత్వం కొరడా ఝళిపించిందని, అవినీతికి దారితీసే పరిస్థితులపైనా పోరాడుతోందని అన్నారు. 'సీబీఐ పరిధి పెరిగింది. చాలా నగరాల్లో సీబీఐ ఆఫీసులు నెలకొల్పుతున్నాం. అవినీతి సాధారణ నేరం కాదు. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు. అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారు. 2014 తరువాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది. అవినీతిపరులు భయపడుతున్నారు. గత ప్రభుత్వాలు అవినీతిని వ్యవస్థీకృతం చేశాయి. ఆర్థిక నేరగాళ్లు వేలకోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయారు. బీజేపీ ప్రభుత్వం అవినీతిపై చిత్తశుద్ధితో యుద్ధం చేస్తోంది' అని స్పష్టం చేశారు. అవినీతిని సహించరాదనేది ప్రభుత్వం, ప్రజల కోరిక అని ఆయన చెప్పారు.