Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక చట్టాలు
- కేంద్ర ప్రభుత్వం అమలు చేయదు : రాజ్యసభలో కేంద్ర మంత్రి కౌషల్ కిశోర్
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వాల పాలనలో పట్టణ ఉపాధి హామీ పథకాలను అమలు చేశాయనీ, అందుకు ప్రత్యేకంగా చట్టాలు కూడా రూపొందించాయని కేంద్ర పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి కౌషల్ కిశోర్ తెలిపారు. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కేరళలో అయ్యంకాలి పట్టణ ఉపాధి హామీ కార్యక్రమం 2010 నుంచి, త్రిపురలో త్రిపుర పట్టణ ఉపాధి కార్యక్రమం 2009 నుంచి, పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్ పట్టణ ఉపాధి హామీ పథకం 2010 నుంచి అమల్లో ఉన్నాయని చెప్పారు. 'ఆయా రాష్ట్రాల్లో పట్టణ ఉపాధి హామీ పథకాలు తీసుకొచ్చినప్పుడు వామపక్ష ప్రభుత్వాలే ఉన్నాయి. కేరళలో వీఎస్ అచ్యుతానందన్ ప్రభుత్వం, త్రిపురలో మాణిక్ సర్కార్ సర్కారు, పశ్చిమ బెంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఈ మూడు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 2020 నుంచి అమలు అవుతుందనీ, రాజస్థాన్లో 2022-23 బడ్జెట్లో ప్రకటించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రచించలేదని స్పష్టం చేశారు. ఈ పథకాల విషయంలో ఆ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయలేదని తెలిపారు.
ఏపీలో మూడు విమానాశ్రయాల ప్రయివేటీకరణ
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను ప్రయివేటీకరించనున్నట్టు పౌర విమాన యాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికె సింగ్ (రిటైర్డ్) తెలిపారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సోమవారం ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వడం ద్వారా 2025 నాటికి రూ.10,782 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు మంత్రి పేర్కొన్నారు. విమానాశ్రయాల ప్రయివే టీకరణ విమానాల రాకపోకలు, మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిదారుల ఆసక్తి, లావాదేవీల నిబంధనలపై ఆధారపడి ఉంటుందని మంత్రి వెల్లడించారు.
'నమామి గోదావరి' ప్రాజెక్టు ప్రతిపాదన లేదు
గంగా నది ప్రక్షాళనకు ఉద్దేశించిన 'నమామి గంగలా గోదావరి ప్రక్షాళనకు 'నమామి గోదావరి' ప్రాజెక్టు చేపట్టే ప్రతిపాదన లేదని జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.