Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీకి లక్షలాదిగా ప్రజలు
- సంఘీభావం ప్రకటించిన మేధావులు, రచయితలు, కళాకారులు
ఢిల్లీ మహానగరంలో ఎటుచూసినా కార్మికులు, కర్షకులే. సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ సంఘాల సంయుక్త పిలుపు మేరకు మోడీ సర్కారుపై రణనినాదం చేసేందుకు లక్షలాదిగా తరలొచ్చిన ప్రజలతో ఢిల్లీ నగర వీధులు కిక్కిరిసిపోయాయి. కుల, మతాల గోడలు మాకడ్డు కావు...ప్రాంతాలు, భాషా వైషమ్యాలు మాకసలే తెలియవు..మాకు తెలిసిందంతా జీవన పోరాటమే...మా పొట్టగొడితే చూస్తూ ఊరుకోబోమంటూ కార్మికులు, కర్షకులు, కూలీలు పొలికేక పెడుతూ మజ్దూర్, కిసాన్ సంఘర్ష్ మార్చ్ ద్వారా ఐక్యతా రాగం వినిపించనున్నారు. దేశ సంపదను అమ్మేస్తుంటే..కార్పొరేట్ల కోసం కార్మిక చట్టాలను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోబోమని బుధవారం రాంలీలా మైదానంలో లక్షలాది మంది శ్రమజీవులు కదంతొక్కనున్నారు. 13 ప్రధాన డిమాండ్లకు పరిష్కారం చూపాల్సిందేనని పట్టుబట్టనున్నారు. ఈ మార్చ్ నిర్వహణ కోసం ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా వేలాది సభలు, సమావేశాలు, జాతాలు, ఇతర ప్రచార కార్యక్రమాన్ని ఆయా సంఘాలు నిర్వహించాయి. కోటి మంది ప్రజలకు ఈ మార్చ్ లక్ష్యాలను వివరించాయి. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కార్మిక, కర్షకులకు రెండు క్యాంప్‌లు ఏర్పాటు చేశారు.
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయాలని నసీరుద్దీన్ షా, ఇర్ఫాన్ హబీబ్, హర్ష్మందిర్, ప్రభాత్ పట్నాయక్, అడ్మిరల్ రామ్‌దాస్, ఎన్.రామ్, పి.సాయినాథ్ వంటి మేధావులు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం చేపడుతున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బుధవారం ఢిల్లీలో తలపెట్టిన కిసాన్ మజ్దూర్ ర్యాలీకి 288 మంది విద్యావేత్తలు, రచయితలు, కళాకారులు మద్దతు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్), ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యుయూ)లు భారీ ప్రదర్శన చేపట్టనున్నాయి. ఆ ర్యాలీకి మద్దతు తెలుపుతున్నట్టు ఒక ప్రకటనలో మేధావులు సంతకాలు చేశారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల వల్ల శ్రామిక ప్రజల పరిస్థితి మునుపెన్నడూ లేని స్థాయికి దిగజారిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తగ్గుతున్న వేతనాలు, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, వ్యవసాయోత్పత్తుల రాబడి తగ్గుదల, క్షీణిస్తున్న వ్యవసాయ వేతనాలు, నానాటికి తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభం ఫలితంగా వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం విధిస్తున్న సంక్షేమ పథకాలపై కోత కారణంగా దారిద్య్రపు రేఖ అంచున ఉన్న వారు మరింత పేదరికంలోకి నెట్టబడ్డారని ఆ ప్రకటనలో తెలిపారు. కార్పోరేట్ సంస్థలకు పన్నులు తగ్గించడం, ప్రభుత్వ రంగ ఆస్తుల విక్రయం, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం, భారీగా కార్పోరేట్ రుణాలను మాఫీ చేయడం, కీలకమైన ప్రభుత్వరంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా ప్రజాధనాన్ని బడాపెట్టుబడిదారులకు దోచిపెట్టడం వంటి చర్యలను మోడీ ప్రభుత్వం గుడ్డిగా ముందుకు తీసుకెళ్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని మైనారిటీలే లక్ష్యంగా పాలక బీజేపీ, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు విద్వేషపూరిత ప్రచారాలను చేపడతున్నాయని పేర్కొన్నారు. ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారికి మోడీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని విమర్శించారు. ఆ విధానాలను వ్యతిరేకించే వారిని అరెస్ట్ చేసేందుకు, వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోందని, వారి ఆస్తులను కూల్చివేసేందుకు బుల్డోజర్లను ప్రయోగిస్తోందని తెలిపారు.
కార్మిక, కర్షక ఐక్య ప్రాధాన్యతను ఈ మేధావులు నొక్కిచెప్తూ 'కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు దేశ కష్టజీవులకు సంబంధించిన డిమాండ్లు ముందుకు తేవడం రానున్న రోజుల్లో ప్రజా పోరాటాలు మరింత పెద్ద ఎత్తున విస్తరిస్తాయనేందుకు మాకు ఎటువంటి సందేహం లేదు' అన్నారు. మతోన్మాద, కార్పొరేట్ శక్తుల ఎజెండాకు నేటి వర్గ శక్తుల ఐక్యతకు కీలకం కానున్నదని నిర్వాహకులు పేర్కొన్నారు.
మూడు వర్గాల కలయికే ప్రాముఖ్యత
- ప్రభాత్ పట్నాయక్
మజ్దూర్, కిసాన్ సంఘర్ష్ ర్యాలీ రిసెప్షన్ కమిటీ చైర్మెన్, ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ మాట్లా డుతూ ఈ ర్యాలీ వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, రైతులు కలిసి చేస్తున్నారు. ''ఈ మూడు వర్గాలు మన సమాజంలోని ప్రాథమిక తరగతులు. అందువల్ల, వారి కలయిక చారిత్రక ప్రాముఖ్యత స్పష్టం చేస్తుంది. సంపన్నులకు సంక్షేమాన్ని అందించడం, అణగారిన వర్గాలను విభజించే మార్గంగా మతపరమైన మతవాదాన్ని ఉపయోగిం చడం కేంద్రం వ్యూహం. ఈ మూడు తరగతులు అత్యంత అణగారిన వర్గాలు, వారు తమ భౌతిక డిమాండ్లపై కలిసి పోరాడుతున్నారు. ఇది వారిపై హిందూత్వ శక్తులు చేస్తున్న కుట్రలను తారుమారు చేస్తుంది'' అని పట్నాయక్ అన్నారు.